తన ఆలోచనలకు తగ్గట్లుగా బీజేపీ అగ్రనేతలను ఒప్పించటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫెయిలైపోయారా ? ఆదివారం నాడు ఎల్లోమీడియాలో వచ్చిన కొ(చె)త్తపలుకులో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పవన్ శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినిచ్చేదిలేదని భీషణ ప్రతిజ్ఞ చేశారు. పవన్ చేసిన ప్రతిజ్ఞ ఉద్దేశ్యం ఏమిటంటే తమతో పాటు చంద్రబాబునాయుడును కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీచేయాలని.





అయితే ఇక్కడే బీజేపీ అగ్రనేతలు పవన్ కు షాక్ ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించాలంటే చంద్రబాబును కూడా పొత్తుల్లో కలుపుకుని వెళ్ళాలన్న పవన్ వాదనను బీజేపీ కొట్టేసిందట. చంద్రబాబుతో ఎట్టి పరిస్ధితుల్లోను పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టంగా చెప్పేసిందట. జగన్ వెళ్ళి చంద్రబాబు ముఖ్యమంత్రయితే మనకేంటి లాభమన్న కమలనాదుల ప్రశ్నకు పవన్ దగ్గర కూడా సమాధానం లేదని ఎల్లోమీడియా చెప్పింది.





చంద్రబాబుకు వయసు మీదపడుతోంది కాబట్టి 2029 ఎన్నికలనాటికి చంద్రబాబు పనైపోతుందని అగ్రనేతలు చెప్పారట. అప్పుడు టీడీపీ జనసేనలో కానీ బీజేపీలో కానీ విలీనమైన తర్వాత పవనే సీఎం కావచ్చని కూడా బీజేపీ అగ్రనేతలు చెప్పారట. కాబట్టి 2029 వరకు వెయిట్ చేయమని పవన్ కు స్పష్టగా చెప్పేశారట. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్ధితిలో పవన్ ఢిల్లీనుండి తిరిగొచ్చేసినట్లు సదరు చెత్తపలుకులో ఎల్లోమీడియా చెప్పింది.





సరే ఇక జగన్ కు వ్యతిరేకంగా తన పైత్యాన్నంతా అచ్చేసింది. చంద్రబాబు సభలకు జనాలు విరగబడి వచ్చేస్తున్నారట. ఒకపుడు ఎన్టీయార్ సభలకు జనాలు ఎలా వచ్చేవారో ఇపుడు అలాగే వస్తున్నారట. జనాలంతా జగన్ను ఓడించాలని డిసైడ్ అయిపోయారు కాబట్టే చంద్రబాబు సభలకు స్వచ్చంధంగా వస్తున్నట్లు డిసైడ్ చేసింది. ఇదే ఎల్లోమీడియా ఒకపుడు రోడ్డుషోలకు, బహిరంగసభలకు జనాలు వచ్చినంత మాత్రాన వాళ్ళంతా ఓట్లేస్తారని గ్యారెంటీలేదని రాసింది. అంటే జనాభిప్రాయాన్ని ఎలాగైనా చంద్రబాబుకు అనుకూలంగా మార్చాలనే తాపత్రయం ఎల్లోమీడియా రాతల్లో స్పష్టంగా కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: