విమాన టికెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇవి దాదాపు రెట్టింపు అయ్యాయి. మరోసారి భారీగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం... విమాన ఇంధన ధరలు రెట్టింపవడమే. విమాన ఇంధన ధరలు పెరగడంతో రేట్లు కూడా పెంచేస్తున్నాయి యాజమాన్యాలు. మరోవైపు దేశీయ విమాన సర్వీసు ఛార్జీలపై కొవిడ్‌ సమయంలో విధించిన పరిమితులు కూడా తొలగించాలని విమానయాన సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే.. విమాన టికెట్ల రేట్లు భారీగా పెరుగుతాయి.

త్వరలో చర్చలు..
విమాన టికెట్ల రేట్లను పెంచేందుకు నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం.. ఈ వారంలో విమానయాన సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు విమాన టికెట్‌ ధరలపై పరిమితులు పూర్తిగా తొలగిస్తారా? లేదా సవరిస్తారా..? అనేది తేలిపోతుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

కొవిడ్ కారణంగా విధించిన పరిమితులను తొలగించాలంటూ ఇటీవల ఇండిగో, విస్తారా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విమానయాన సంస్థల మొత్తం వ్యయాల్లో 40 శాతం వాటా విమాన ఇంధనానికే ఉంటుంది. ఇంధనం ఇప్పుడు బాగా రేటు పెరిగింది. దీంతో టికెట్ల రేట్లు పెంచకపోతే గిట్టుబాటు కాని పరిస్థితి. అందుకే విమాన యాన సంస్థలకు టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఈ సమస్యకు పరిష్కారం అని ఆయా సంస్థలంటున్నాయి. విమాన ఇంధన ధర బాగా పెరగడంతోపాటు.. రూపాయి మారకపు విలువ పతనం కావడంతో.. విమాన యాన సంస్థలకు నష్టాలు వస్తున్నాయట. దీంతో దేశీయ విమాన ప్రయాణ ఛార్జీల పరిమితులను దాదాపుగా 10నుంచి 15 శాతం పెంచాలని వారు కోరుతున్నారు. అయితే విచిత్రంగా.. గోఫస్ట్‌ ఎయిర్ లైన్స్ సంస్థ ఛార్జీలపై పరిమితి తొలగింపుని వ్యతిరేకిస్తోంది. విమానయాన సంస్థల మనుగడకు ఈ కనిష్ట చార్జీలు దోహదపడతాయని అంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.


మరింత సమాచారం తెలుసుకోండి: