నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా నాలుగో కృష్ణుడు ఖాయమైనట్లేనా ? ఇపుడిదే డౌట్లు పెరిగిపోతున్నాయి. ఐఏఎస్ మాజీ అధికారి, కేంద్రమాజీమంత్రి యశ్వంత్ సిన్హా పోటీచేయబోతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ప్రకటించారు. సిన్హా మెడలో కండువాను కూడా కప్పేశారు. కాబట్టి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా సిన్హా పోటీచేయబోతున్నట్లు ఇప్పటికైతే అనుకోవాల్సిందే.





ఇప్పటికి అని ఎందుకంటే మొదటి శరద్ పవార్ అనుకున్నారు. కానీ పవార్ పోటీ నుండి తప్పుకున్నారు. తర్వాత ఫరూక్ అబ్దుల్లాను ఖాయం చేశారు. ఆయనా పోటీచేయటంలేదని ప్రకటించేశారు. చివరకు గోపాలకృష్ణగాంధీయే ఫైనల్ అని ప్రకటించారు. కానీ అందరికీ షాకిచ్చి గాంధీ కూడా పోటీచేసేదిలేదని తప్పుకున్నారు. దాంతో అసలు విపక్షాల తరపున పోటీకి ఎవరైనా అభ్యర్ధి దొరుకుతారా అనే సందేహాలు పెరిగిపోయాయి.





22 ప్రతిపక్షాలు కలిసి ఒక్క రాష్ట్రపతి అభ్యర్ధిని ఉమ్మడిగా ఫైనల్ చేయలేకపోవటం నిజంగా బాధాకరమనే అనుకోవాలి. ఇంతపెద్ద దేశంలో ఇన్ని పార్టీల్లో ఒక్క అభ్యర్ధి దొరకకపోవటమే విచిత్రమనిపించింది. ఈ విషయంలో ప్రతిపక్షాల్లో దేనికదే ఇతర పక్షాలను చాలా తేలిగ్గా తీసుకున్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధినే నిర్ణయించలేని ప్రతిపక్షాలు రేపు ప్రధానమంత్రి అభ్యర్ధిని మాత్రం ఏమి నిర్ణయించగలవని స్వయంగా శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్ధవ్ థాక్రే అందరినీ కలిసి ఏకిపారేశారు.





దాంతో జనాలముందు ప్రతిపక్షాలు పలుచనైపోయాయి. ఈ నేపధ్యంలోనే యశ్వంత్ సిన్హా పేరును మంగళవారం ప్రతిపక్షాల సమావేశం ఖాయంచేసింది. అందుకనే సిన్హా పోటీచేసే విషయమై ప్రతిపక్షాల్లోనే కాదు జనాల్లో కూడా చాలా డౌటనుమానాలున్నాయి. సరే గెలుపు ఓటములను పక్కనపెట్టేయాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి నూరుశాతం సిన్హాకే ఓట్లేసినా గెలుపు అవకాశాలు తక్కువనే చెప్పాలి.






ఎలాగంటే ఎన్డీయే, నాన్ ఎన్డీయేలో లేని టీఆర్ఎస్, వైసీపీ, బీజూ జనతాదళ్, ఆప్ లో ఏ ఒక్కటి ఎన్డీయేకి మద్దతిచ్చినా నరేంద్రమోడి ప్రతిపాదించిన అభ్యర్ధి గెలుపు ఖాయమే. అయితే సిన్హా అభ్యర్ధిత్వానికి టీఆర్ఎస్ చీఫ్ తెలంగానా సీఎం కేసీయార్ మద్దతు ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏమిచేస్తారో తెలీదు. బీజూ జనతాదళ్ చీఫ్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తెలియాల్సుంది. వైసీపీ చీఫ్, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎన్డీయేకే అని అందరు అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: