కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా.. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే దాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వంపైకి తోసేయడం అలవాటు చేసుకుంది. 8 ఏళ్లనుంచి అధికారంలో ఉంటున్నా కూడా వారిది అదే పంథా. ఇటు ఏపీలో కూడా ఇంకా టీడీపీని తిట్టేందుకే వైసీపీ ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఏపీలో ఏ సమస్య ఉన్నా.. గతంలో టీడీపీ వల్లే ఇలా జరిగిందనే ప్రచారం చేస్తున్నారు, విమర్శిస్తున్నారు.

ముఖ్యంగా జాతీయ హోదా విషయంలో గతంలో టీడీపీ అలా చేసి ఉండకపోతే ఇప్పుడు హోదా వచ్చి ఉండేదనేది వైసీపీ వాదన. ఆ వాదన పక్కనపెడితే ఇప్పుడు హోదాకోసం వైసీపీ ఏం చేస్తోందనేేదే అసలు ప్రశ్న. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైసీపీ, తన అసంతృప్తిని బయటపెట్టే అవకాశం వచ్చింది. ఏపీకీ జాతీయ హోదా ప్రకటించలేదు కాబట్టి.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తే.. ఆ వ్యతిరేకత తెలియజేసినట్టవుతుంది. పోనీ వ్యతిరేకంగా ఓటు వేయడం ఇష్టం లేకపోతే తటస్థంగా ఎన్నికలకు దూరంగా కూడా ఉండొచ్చు. కానీ అదీ చేయలేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది వైసీపీ. స్వతంత్ర భారత చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనట్టుగా తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీ వైసీపీ అని, అలాంటి పార్టీగా.. తాము ద్రౌపదీ ముర్ము కే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు వైసీపీ నేతలు. మంత్రివర్గ సమావేశం కారణంగా.. సీఎం జగన్ ద్రౌపదీ ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నారని, ఆయన స్థానంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌ సభాపక్ష నేత నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారని వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగాల్సి ఉంది.

ఎస్టీ అభ్యర్థి కాబట్టి, సామాజి కోణంలో తాము ఆమెకు మద్దతిచ్చామని చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే కనీసం ప్రతిపక్షాల మధ్య రాష్ట్రపతి అభ్యర్థి అనే విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా వైసీపీ ఎందుకు ఆ దిశగా చొరవ తీసుకోలేదు అంటే దానికి సమాధానం లేదు. ఇక్కడ టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. పోనీ టీడీపీ అయినా ఎన్నికలకు దూరంగా ఉంటుందా, లేక ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: