సొంత పార్టీలోనే తనను కొంతమంది టార్గెట్ చేశారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగానే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని, తన ఇమేజ్ డ్యామేజీ చేస్తున్నారని అన్నారు. సొంత పార్టీ నేతలకు పార్టీలోని కొందరు ముఖ్య నేతల సపోర్ట్ ఉందని, వారి వల్లే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. ఇంతకీ బాలినేనిని టార్గెట్ చేసిన ఆ ముఖ్యనేత ఎవరు..? బాలినేని మంత్రి పదవి పోవడానికి కారణం కూడా ఆయనేనా..? అసలు ఒంగోలులో ఏం జరుగుతోంది..? బాలినేని పార్టీలో ఉంటారా.. లేదా పక్కదారి చూసుకుంటారా.?

గతంలో చెన్నైలో పట్టుబడిన బంగారు వ్యాపారి డబ్బు, అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేనికి చెందినదేననే ప్రచారం జరిగింది. అప్పట్లో హవాలా మంత్రి అంటూ, హవాలా సొమ్ము మారుస్తున్నారంటూ బాలినేనిని టార్గెట్ చేశారు. దాని వెనక కూడా కొంతమంది ఉన్నారని ఆరోపించారు బాలినేని. తాజాగా.. కొత్తపట్నం మండలానికి చెందిన ఓ మహిళ వ్యవహారంలో తనని అనవసరంగా ఇరికిస్తున్నారని అన్నారు. ఆ మహిళ వ్యక్తిగత గొడవలతో తనకేం సంబంధం అని ప్రశ్నించారు. వైసీపీలోని కొందరు పెద్ద నేతలు కూడా తనపై తప్పుడు ప్రచారం చేసేవారితో టచ్ లో ఉన్నారని అన్నారు బాలినేని. ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాలినేని. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటానని సవాల్ విసిరారు బాలినేని శ్రీనివాసులరెడ్డి.

ప్రతిపక్ష నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే, వారికి కొంతమంది తమ పార్టీ నేతలే వత్తాసు పలుకుతున్నారని సంచనల ఆరోపణలు చేశారు బాలినేని. వారెవరో తనకు తెలుసని, వారి సంగతి చూస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం బాలినేని కామెంట్స్ వైసీపీలో సంచలనంగా మారాయి. ఆయనని టార్గెట్ చేసింది ఎవరా అని ఆరా తీస్తున్నారంతా. బండారం బయటపెడతానంటూ హెచ్చరిస్తున్నారంటే.. వారు కూడా పెద్ద స్థాయిలో ఉన్న నాయకులేనని అంటున్నారు. ఇంతకీ ఆ నాయకుడు, బాలినేనిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది. బాలినేని రాజకీయ పతనం ఆయనకు అంత ముఖ్యమా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: