సహజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన పేరుతో ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకుంటుంటారు అధికారులు. వాటి పరిష్కారానికి మార్గం వెదుకుతారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన నిర్వహిస్తుంటారు. కానీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చాలానే ఉంటాయి. కానీ ఈసారి జనసేన పార్టీ ఇలాంటి స్పందన కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తోంది. దానికి జనవాణి అనే పేరు కూడా పెట్టింది.

ప్రజల సమస్యలను విని, వాటిని ప్రభుత్వానికి తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిచామంటున్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. బాధితులనుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారని ఆయన చెప్పారు. కష్టాల్లో ఉన్న జనాలకు జనసేన భరోసా ఇస్తుందని, అందుకోసమే జనవాణి కార్యక్రమం పెడుతున్నామని అంటున్నారు. జూలై 3వ తేదీన విజయవాడలో ‘జన వాణి’ కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు తెలిపారు నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ప్రతి ఆదివారం పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు తీసుకుంటారని, వరుసగా వచ్చే ఐదు వారాలు జనవాణి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని జులై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించేందుకు జనసేన సన్నాహాలు చేసుకుంటోంది. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడేవని, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టేవని తెలిపారు మనోహర్. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక, మూడేళ్లలో ఒక్క అర్జీ కూడా సామాన్యుడి నుంచి స్వీకరించలేదని, ఇలాంటి కార్యక్రమాలేవీ చేపట్టలేదని ఎద్దేవా చేశారు. సామాన్యుడి చేతుల మీదుగా అర్జీలు స్వీకరించలేదన్నారు. అందుకే ఇప్పుడాపని జనసేన చేస్తోందని చెప్పారు నాదెండ్ల మనోహర్. ఇదేదో తూతూ మంత్రంగా జరిగే పని కాదని, ప్రజల సమస్యలను ఓపికగా పవన్ కల్యాణ్ వింటారని, జనవాణిలో ఆ సమస్యలపై ఇచ్చే అర్జీలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం కౌలు రైతుల భరోసా యాత్రల పేరుతో జనంలోకి వస్తున్నారు పవన్ కల్యాణ్. దసరా నుంచి రాజకీయ యాత్ర మొదలు పెడుతున్నారు. ఈలోగా జనవాణి ప్రారంభిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: