ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి కౌంటర్లు ఇస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడాయన ఓపెన్ లెటర్ తో మోదీకి మరో కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ కేటీఆర్ లేఖలో ఏముంది. అసలు కేటీఆర్ లేఖ ఎందుకు రాశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై టీఆర్ఎస్ కి ఎందుకంత ఫోకస్..

కేటీఆర్ లేఖలో ఉన్న అంశాలివి..
హైదరాబాద్ కు వస్తున్న బీజేపీ నాయకులకు కుల మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని తెలంగాణ తరపున స్వాగతం సుస్వాగతం అంటూ ఆ లేఖను మొదలు పెట్టారు కేటీఆర్. అద్భుతమైన అభివృద్దితో ప్రపంచపటంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న హైదరాబాద్ లో బీజేపీ సమావేశం పెట్టుకోవడంలో ఆశ్చర్యంలేదంటున్నారు కేటీఆర్. డబుల్ ఇంజిన్ సర్కార్ లు కొలువై ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఆ పరిస్థితులే ఆ నాయకుల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు కేటీఆర్. కారణాలేవైనా.. బీజేపీ నాయకత్వం మొత్తం హైదరాబాద్ లో మకాం పెడుతున్న సందర్భంలో.. తెలంగాణను చూసి వారు ఎంతో కొంత నేర్చుకోవాలని చెప్పారు.

బీజేపీ డీఎన్ఏలో విద్వేషం, సంకుచితత్వం ఉందని, అలాంటి పార్టీ నాయకులు.. ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని తాను అనుకోవడం లేదని, అలా అనుకుంటే అది అత్యాశే అవుతుందని చెప్పారు కేటీఆర్. కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసే బీజేపీ దుర్మార్గ రాజకీయాల చుట్టూ ఈ చర్చలు జరుగుతాయనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు కేటీఆర్. వినూత్నమైన విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో తెలంగాణ గడ్డ చరిత్ర సృష్టిస్తోందని, ఈ గడ్డను చూసైనా రాజకీయాలు, ఆలోచనలను మార్చుకోవాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు కేటీఆర్. అందరినీ కలుపుకొనిపోయే స్వభావం తెలంగాణదని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తితో అభివృద్ధి ఎజెండాను చర్చించేందుకు ఇంతకు మించిన గొప్ప ప్రదేశం బీజేపీకి మరొకటి దొరకదని చెప్పారు కేటీఆర్.

అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న బీజేపీ నేతలకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని తాను అనుకోవడం లేదన్నారు కేటీఆర్. బీజేపీ అస్తవ్యస్థ విధానాలు, అసమర్థ పాలనతో దేశమంతా దుష్పరిణామాలు అనుభవిస్తోందని, చెప్పారాయన. దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాలను కేవలం రెండు రోజుల్లో అధ్యయనం చేయడం అసాధ్యం అని, కానీ తెలంగాణ విజయాలను గుర్తు చేయడం తన బాధ్యత అని ఆ లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: