సంక్షోభం ముగిసిన మరుసటిరోజు శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉథ్థవ్ థాక్రే బీజేపీకి సూటిగా ఒక ప్రశ్నవేశారు. అదేమిటంటే 2019 ఎన్నికల్లో శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ఎందుకు అంగీకరించలేదని. 2019 ఎన్నికల్లో బీజేపీ+శివసేన కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే.  అధికారంలోకి రావటానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రెండుపార్టీలకు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన పట్టుబట్టింది.






తమ మిత్రపక్షానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదని తెగేసిచెప్పింది. అత్యధిక సీట్లు గెలుచుకున్నాం కాబట్టి  తమపార్టీ నుండే సీఎం అభ్యర్ధి ఉంటారని బీజేపీ తెగేసిచెప్పింది. దాంతో ముఖ్యమంత్రి పదవి విషయమై రెండుపార్టీల మధ్య చర్చలు జరిగి, పట్టుదలకు పోయాయి. చివరకు శివసేన పొత్తు నుండి బయటకు వచ్చేసింది. వెంటనే ఎన్సీపీ+కాంగ్రెస్ తో చేతులు కలిపింది. వెంటనే ఉథ్థవ్ థాక్రే సీఎంగా మహా వికాస్ అఘాడీ సంకీర్ణప్రభుత్వం ఏర్పాటైపోయింది.






సీన్ కట్ చేస్తే రెండురోజుల క్రితం 106 మంది ఎంఎల్ఏల బలమున్న బీజేపీ పొత్తులో శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. షిండే ఏపార్టీకి కూడా అదినేత కాదు. కేవలం శివసేన చీలికవర్గానికి నాయకత్వం వహిస్తున్నారంతే. ఒక చీలికవర్గానికి నాయకత్వం వహిస్తున్న షిండేకి మద్దతిచ్చి బీజేపీ ఎలా ముఖ్యమంత్రిని చేసింది ? అన్నదే ఇక్కడ పాయింట్.






ఇపుడు ముఖ్యమంత్రి అవటానికి  షిండేకి మద్దతిచ్చిన బీజేపీ మరపుడు శివసేన చీఫ్ ఉథ్థవ్ కు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి అంగీకరించలేదు ? అప్పట్లోనే సీఎం పదవి థాక్రేకి ఇచ్చుంటే మహా వికాస్ అఘాడీకి బదులు  బీజేపీ+శివసేన పార్టీలే అధికారంలోకి ఉండేవికదా. మొన్న జరిగిన వారంరోజుల రాజకీయ సంక్షోభం తలెత్తేది కాదుకదా. అప్పట్లో థాక్రేకి సీఎం పదవి ఇవ్వటానికి నిరాకరించిన బీజేపీ ఇపుడు అదే పదవిని ఏక్ నాథ్ షిండేకి ఎలా అప్పగించింది ? అప్పుడు తమను దెబ్బకొట్టిన థాక్రేపై కసితీర్చుకునేందుకే ఇపుడు షిండేకి సీఎం పదవి ఇవ్వటానికి బీజేపీ అంగీకరించినట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: