ఏపీలో డేంజరస్ డయేరియాతో 40మంది ఆస్పత్రిపాలైన ఘటన కలవరపెడుతోంది. ఈ ఘటన గుంటూరు జిల్లా కొలకలూరులో జరిగింది. డయేరియాతో పదులసంఖ్యలో ప్రజలు ఆస్పత్రిపాలవుతున్నారు. ఇప్పటికే 40మంది ఆస్పత్రిలో చేరగా.. మరికొంతమంది అవే లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నట్టు తెలుస్తోంది. మంచినీరు కలుషితంగా మారడమే దీనికి కారణం అని వైద్యాధికారులు చెబుతున్నారు.

డయేరియా ప్రబలిందన్న సమాచారంతో జిల్లా అధికారులు కొలకలూరుకు చేరుకున్నారు. స్థానికంగా వారు ప్రజలకు ధైర్యం చెప్పారు. స్థానిక సిబ్బందికి అవగాహన కల్పించారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. కొలకలూరు గ్రామంలో తాగునీటి శాంపిల్స్ ని సేకరించారు. వాటిని ప్రయోగశాలకు పంపించి పరీక్షిస్తున్నారు అధికారులు.

కొలకలూరు గ్రామంలో తీవ్రమైన విరోచనాలు, వాంతులతో ఇప్పటికే 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఓ బాలిక చనిపోవడంతో మరింత ఆందోళన కనపడుతోంది. అప్రమత్తమైన అధికారులు, వైద్య సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఇక్కడ నియమించారు. బాధితులంతా
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ,ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు.

మరోవైపు అధికారుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. రెండు రోజులగా గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలుతున్నా కూడా స్థానిక సిబ్బందికి అనుమానం రాలేదని, అధికారులు కూడా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆమేరకు జిల్లా కలెక్టర్ కి వారు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి నుంచి జిల్లా కలెక్టర్ స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు, మంచినీటి పంపిణీ ఎలా జరుగుతుందనే విషయంపై ఆరా తీశారు. డయేరియాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కూడా వారు పరామర్శించారు. కొలకలూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనే ఆరోపణలున్నాయి. మంచినీటి పైపులు మురుగు కాల్వల గుండా వెళ్తున్నాయని, అందుకే మురికినీరు మంచినీటిలో కలసిపోయి ఉంటుందని, దానివల్లే ఈ అనర్థం జరిగి ఉంటుందని చెబుతున్నారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: