జరిగింది చూస్తుంటే అందరికీ ఇదే అనిపిస్తోంది. హైదరాబాద్ లో మూడురోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. సరే కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ కాబట్టి ఆర్భాటాలకు, అట్టహాసాలకు కొదవేలేదు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి కీలకనేతలంతా ఇక్కడే ఉన్నారు.





ఇంతటి ప్రిస్టేజియస్ సమావేశాలు కాబట్టే కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన ప్రముఖనేతలు బీజేపీలో చేరుతారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఎలాగూ మోడీ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి కార్యవర్గ సమావేశాల సమయంలోనో లేకపోతే బహిరంగసభ సందర్భంగానో చాలామంది నేతలు కమలతీర్ధం పుచ్చుకుంటారని విపరీతంగా ప్రచారం చేశారు. తీరాచూస్తే కార్యవర్గ సమావేశాలైపోయాయి. తర్వాత బహిరంగసభ కూడా జరిగిపోయింది.





ఇంతకీ జరిగింది ఏమిటయ్యా అంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక్కళ్ళు మాత్రమే చేరారు. మరి ప్రచారం జరిగినట్లుగా మిగిలిన నేతలంతా ఏమయ్యారు ? ఎందుకు చేరలేదు ? అనే విషయం అర్ధం కావటంలేదు. పై రెండుపార్టీల్లోని గట్టి నేతలకు చాలామందికే బీజేపీ గాలమేసింది. అలాంటి వాళ్ళల్లో కొందరు మోడీ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం చేసుకున్నారు. తీరాచూస్తే ఒక్కళ్ళు మాత్రమే చేరారు.





చేరుతారని అనుకున్న నేతల్లో చాలామంది వెనకడుగు వేశారంటే ఆశ్చర్యం, అనుమానాలు పెరిగిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయటం ఖాయమని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు కానీ ఆ పార్టీకి అంత సీన్ లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపేందుకు పట్టుమని 20 మంది నేతలు కూడా లేరు. అందుకనే మిగిలిన పార్టీల్లోని నేతలకు పదే పదే గాలమేస్తున్నారు. కనీసం 100 మంది నేతలను చేర్చుకుంటేకానీ రేపటి ఎన్నికల్లో పోటీకి గట్టి అభ్యర్ధులు దొరకని పరిస్ధితి. బీజేపీ అధికారంలోకి రాదని చాలామందికి అర్ధమైన కారణంగానే వెనకంజ వేశారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: