ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ముగింపు సమయంలో సీఎం జగన్ ఆయనకు ఓ వినతిపత్రం అందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం పాతదే అయినా మరోసారి ఆయన మోదీకి దాన్ని గుర్తు చేశారు. జగన్, ఢిల్లీ పర్యటనల్లో మోదీని కలసినా, ఇంకే ఇతర నాయకుల్ని కలసినా విభజన సమస్యల పరిష్కారంపై విజ్ఞాపన పత్రాలిస్తుంటారు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై కూడా ఓ మాట వేస్తుంటారు. ఇప్పుడు ఏపీలోనే ప్రధానికి మరోసారి విజ్ఞప్తి చేశారు జగన్.

వ్యూహాత్మకంగానే..?
ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని పదే పదే చెబుతుంటారు రాజకీయ నాయకులు. దాదాపుగా అన్ని పార్టీల నేతలదీ ఇదే అభిప్రాయం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు జగన్. కానీ ఇక్కడ వైసీపీ గెలిచినా.. అక్కడ బీజేపీకి ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది. దానివల్ల తాము ప్రత్యేక హోదా తేలేకపోయామని చెబుతున్నారు జగన్. వాస్తవానికి ఏపీకి హోదా ఇస్తే.. మిగతా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు వస్తాయని భావిస్తున్న బీజేపీ.. పూర్తిగా ఆ అంశాన్ని పక్కనపెట్టింది. ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వరని అంటున్నారు. ఈ దశలో కొత్తగా జగన్ వినతిపత్రం ఇవ్వడం దేనికి సంకేతం. కేవలం ఏపీ ప్రజల కంటితుడుపు కోసమే ఈ లెటర్ ఇచ్చారా..? లేక దానివల్ల ఉపయోగం ఏదైనా ఉందా అనేది తేలాల్సి ఉంది.

విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని, ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే.. ఆ మేరకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని సీఎం జగన్, మోదీకి విజ్ఞప్తి చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలు పలికిన సందర్భంలో వినతిపత్రం అందజేశారు. ఇక మిగతా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా కేంద్రం పెద్ద మనసు చూపాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్ల విడుదలకు కేంద్రం ఆమోదం తెలపాలని, ప్రధాని ఆ దిశగా చొరవ చూపాలని కోరారు. విభజన తర్వాత తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావల్సిన రూ.6,627 కోట్ల బకాయి కూడా ఇప్పించాలని కోరారు. రూ.34,125.5 కోట్లు రిసోర్స్‌ గ్యాప్‌ కింద ఏపీకి కేంద్రం గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: