కమలంపార్టీ లోకల్ నేతలకు తెలిసినా పాపం ఏమీ చేయలేని అశక్తులు. ఢిల్లీ పాలకులకేమో ఎంతచెప్పినా అర్ధం కావటంలేదు. పైగా ఎంతచేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదని బాగా అర్ధమైపోయినట్లుంది. అందుకనే ఏపి ప్రయోజనాల విషయంలో నరేంద్రమోడి ఏమాత్రం ఆలోచించటంలేదు. ఎంతసేపు నమస్కారాలు, వందనాలు, ఆంధ్రా ప్రజలు చాలా చైతన్యవంతులని పొగిడేసి చేతులూపేసి వెళ్ళిపోతున్నారు.





మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి నాలుగు మాటలు తెలుగులో మాట్లాడేస్తే బుట్టలో పడిపోతారని అనుకున్నట్లున్నారు. కానీ ఇలాంటి పాలకులను జనాలు చాలామందిని చూశారన్న విషయం మోడీకి తెలీదేమో. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధి కూడా ఏపీలో పర్యటించినపుడల్లా తన ప్రసంగాన్ని తెలుగులోనే మొదలుపెట్టేవారు. సరే ప్రస్తుత విషయానికి వస్తే ఏపీలో కొద్దిగంటలసేపు పర్యటించిన మోడీ రాష్ట్రప్రయోజనాల గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు.





ప్రజలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా ప్రకటించకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఒకవైపు ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తు, మరోవైపు కొత్తగా ఎలాంటి ప్రయోజనాలను కల్పించని మోడీ సర్కార్ అంటేనే జనాలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలో అసలు బీజేపీకి ఎందుకు ఓట్లేయాలని అడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నికల్లో బీజేపీ స్ధానమేంటో చూపిస్తున్న జనాలు ఇకముందు కూడా అదే పద్దతిలో వ్యవహరించబోతున్నారు.





జనాల మూడ్ చూస్తుంటే కేవలం మోడీ మీద ఉన్న మంటతోనే బీజేపీకి ఓట్లేయటంలేదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మామూలుగా ఎలాంటి నేతైనా జనాల మనసులను గెలుచుకునేందుకు రాష్ట్రానికి ఏదో ఒక హామీఇస్తారు. హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ మోడీ మాత్రం అలాంటి విషయాలను ఆలోచించటంలేదు. కారణం ఏమిటో తెలీదుకానీ ఏపీ అంటేనే పగబట్టినట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారు. నిజానికి మోడీ వ్యవహార శైలే ఏపీ బీజేపీకి పెద్ద శాపంగా మారిపోయింది. చూస్తుంటే ప్రధానమంత్రిగా మోడీ ఉన్నంత వరకు ఏపీ ప్రయోజనాలు ఏమీ సిద్ధించేట్లు లేదు. ఇదే సమయంలో బీజేపీకి జనాలు ఓట్లూ వేసేట్లులేరు. అంటే ప్రధానిగా మోడీ ఉన్నంతవరకు అంతే సంగతులన్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: