ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రుతుపవనాల వల్ల కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ముంబై నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముంబైలోని చాలా ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది, ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి, ప్రజా రవాణా కూడా స్తంభించింది. పట్టాలు మునిగిపోవడంతో స్థానిక రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. పలు ప్రాంతాల్లో లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో రైలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు, రైలు మార్గాలలోకి వరదనీరు చేరడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు.

మహారాష్ట్రలో ముంబై సహా పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబైకి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాల కారణంగా.. ఠాణేలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై గుంత ఉండటంతో కింద పడ్డాడు. అదే సమయంలో ఓ బస్సు అటుగా వెళ్తోంది. ఆ బస్సు అతడిపైనుంచి వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యాడు. రోడ్లపై గుంతలు ఉండటం వల్ల ఆ వ్యక్తి మరణించాడని, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వర్షాల పరిస్థితులపై నూతన ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిందే.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతి కారణంగా నీటి ప్రవాహంలో ఆరుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో మలానా, మణికరణ్‌ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సిమ్లాలోని ధల్లీ టన్నెల్ వద్ద వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. అటు బిహార్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: