టీడీపీ మహానాడుకి ఏమాత్రం తీసిపోకుండా వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజునుంచి రెండురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సహజంగా టీడీపీ మహానాడు అంటే అందులో భోజనాల గురించి అందరూ చర్చించుకుంటారు. ఇటీవల మోదీ హైదరాబాద్ పర్యటన విషయంలో కూడా విందు భోజనం చేయించేందుకు చేయి తిరిగిన మహిళా వంట మాస్టర్ ని పిలిపించారు. ఆ వార్తలు కూడా బాగా హైలెట్ అయ్యాయి. ఇప్పుడు వైసీపీ ప్లీనరీలో కూడా ఈ భోజనం వ్యవహారం హైలెట్ గా మారుతోంది. తొలిరోజు ఫుడ్ మెను ని బయటకు విడుదల చేశారు వైసీపీ నేతలు. అందులో 25రకాల వంటకాలున్నాయి. దాదాపు ప్రతి జిల్లా నుంచి అక్కడి స్పెషల్ వంటకాన్ని ఇక్కడ చేయిస్తున్నారు. అతిథులు ఈ వంటకాలను చూస్తేనే కాదు, వింటేనే నోరూరిపోయేలా ఉన్నాయి.

ప్లీనరీ మెనూ..
సీఎం వైఎస్‌ జగన్‌ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరు కాబోతున్న ఈ ప్లీనరీలో భోజనం మెనూ అదిరిపోతోంది. అతిథులకోసం 25 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. తొలిరోజు ప్లీనరీకోసం వచ్చే రెండున్నర లక్షలమంది కోసం ఈ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. వంట రెడీ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికీ ఆ రుచి అందేలా.. ప్లీనరీ ప్రాంగణంలో భోజనం వడ్డించేందుకు 250 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ విందు భోజనం సందడి మొదలవుతుంది. రెండున్నర లక్షలమందికి వడ్డించడం అంటే మాటలా. 250 కౌంటర్లు పెట్టుకున్నా కూడా అది కాస్త కష్టసాధ్యమే. అందుకే.. మధ్యాహ్నం 11 గంటలనుంచే భోజనాలు మొదలవుతాయి. 3 గంటల వరకు కొనసాగుతాయి. అతిథుల సంఖ్యను బట్టి ఆ తర్వాత కూడా భోజనాలు అందరికీ వడ్డిస్తారు. మెనూ విషయానికి వస్తే.. ఇందులో 25 రకాల వంటలు ఉన్నాయి. వెజ్‌, నాన్‌వెజ్‌ లో రకరకాల వెరైటీలు ఇక్కడ చేస్తున్నారు. మటన్‌ థమ్‌ బిర్యాని, చికెన్‌ రోస్ట్‌, రొయ్యల కూర, బొమ్మిడాయిల పులుసు, చేపల పులుసు, ఉడికించిన కోడిగుడ్లు, వెజ్ బిర్యానీ, ఆవకాయ.. ఇలా మొత్తం 25 వెరైటీలు అందుబాటులో ఉంటాయని వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.


 రెండేళ్ల గ్యాప్ తర్వాత జరుగుతున్న ఈ ప్లీనరీ సమావేశాలకోసం వైసీపీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు, రేపు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ప్లీనరీ జరుగుతుంది. పార్టీ ఆవిర్బావం తరువాత ఇది మూడో ప్లీనరీ, అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కూడా ఇదే కావడం విశేషం. ఈ ప్లీనరీలో సీఎం జగన్ పలు కీలక ప్రకటనలు చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ కీలక ప్రకటనలకంటే ఫుడ్ మెనూ మాత్రం అదిరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: