వర్షాల్ని సైతం లెక్క చేయకుండా ప్లీనరీకి కార్యకర్తలు తరలి వచ్చారంటూ వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతే ప్లీనరీని టార్గెట్ చేశారు. రెండురోజులపాటు గుంటూరు జిల్లాలో జరిగిన వైసీపీ ప్లీనరీ జనం లేక అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ప్లీనరీని సమర్థంగా నిర్వహించలేకపోయారని చెప్పారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు ప్లీనరీలో మద్య నియంత్రణ అనే పదం వాడటం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై మరోసారి పార్టీ నేతలు పునరాలోచించుకోవాలని చెప్పారు రఘురామకృష్ణంరాజు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రఘురామ, ఆమధ్య భీమవరంలో జరిగిన ప్రధాని మోదీ సభకు రావాల్సి ఉన్నా రాలేకపోయారు. అప్పటికే ఆయన అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఆయన హైదరాబాద్ నుంచి ట్రైన్ లో బయలుదేరి కూడా ముందుకు రాలేదు, అక్కడే వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి, రఘురామ సహా ఆయన కుమారుడు, పీఏపై కేసులు.. ఇలా ఆ ఎపిసోడ్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత రఘురామ తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు, ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, తనని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని, కేసీఆర్ అయినా ఆ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఆయన ప్లీనరీని కామెంట్ చేసి టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు.

వీసా లేదు అందుకే రాలేదు..
ఏపీకి వెళ్లడానికి తనకు వీసా లేదని సెటైర్లు వేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. అందుకే తాను ప్లీనరీకి వెళ్లలేదని చెప్పారు. వైసీపీ కోసం కష్టపడిన జగన్ తల్లి, చెల్లి కూడా పార్టీనుంచి వెళ్లిపోయారని అన్నారు రఘురామ. ప్లీనరీలో నేతలు చేసిన ప్రసంగాలపై కూడా ఆయన సెటైర్లు వేశారు. ప్లీనరీ వేదికపై.. అమరావతిలో మానసిక వైద్యశాల ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దానికి రఘురామ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని అన్నారంటే, అది కచ్చితంగా ఏర్పాటు చేసి తీరాల్సిందేనని అన్నారు రఘురామ. పార్టీలోనే ఉంటూ, ప్రస్తుతం పార్టీని చికాకు పెడుతున్నారు రఘురామ కృష్ణంరాజు. పార్టీ కూడా ఆయనపై స్పందించడం తగ్గించేసింది. అయితే మరో ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం సోషల్ మీడియాలో పదే పదే రఘురామను టార్గెట్ చేస్తుంటారు. ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇప్పుడు ప్లీనరీపై సెటైర్లు వేసిన రఘురామపై వైసీపీ నేతలు ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: