న్యూస్ పై కనీస అవగాహన ఉండి, వెబ్ సైట్ డొమైన్ రిజిస్ట్రేషన్, వెబ్ సైట్ డిజైనింగ్ కి నామినల్ ఖర్చు పెట్టుకోగలిగితే ఎవరైనా న్యూస్ వెబ్ సైట్ పెట్టొచ్చు. కానీ ఇకపై ఇలాంటివాటికి కేంద్రం చెక్ పెట్టబోతోంది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ మీడియాకు పరిమితులు లేవని, అందుకే డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది కేంద్రం. ఈ బిల్లుకి ఆమోద ముద్ర పడితే, డిజిటల్ మీడియాను దుర్వినియోగం చేయడం కుదరదు, అలాంటివారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే.. తప్పుడు సమాచారం వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేశారంటే.. ఆ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది, జరిమానా కూడా విధిస్తారు.

ఈ కొత్త బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చి, ఆమోదం పొందితే చ‌ట్టంగా మారుతుంది. ఇది చట్టం అయ్యాక, డిజిట‌ల్ మీడియా కూడా ఆ చ‌ట్టం ప‌రిధిలోకి వస్తుంది. దీనికోసం ఇప్పటి వరకూ అమలులో ఉన్న రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లుకు కేంద్రం మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పులకు ఆమోద ముద్ర పడితే ఇప్పటి వరకూ ప్రభుత్వ రెగ్యులేష‌న్ ప‌రిధిలో లేని డిజిట‌ల్ న్యూస్ కాస్తా, ఇకనుంచి మీడియా రిజిస్ట్రేష‌న్ చ‌ట్టం ప‌రిధిలోకి వస్తుంది.

కొత్త నిబంధనలు అమలులోకి వస్తే.. 90 రోజుల లోపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్ వద్ద ఆయా వెబ్ సైట్స్ రిజిస్టర్ చేసుకోవాలి. అయితే ఈ బిల్లుకు ఇంకా ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి రావాల్సిన అవసరం ఉంది. 2019లో కూడా కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంది. కొత్త ఐటీ చట్టం ప్రకారం డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నించింది. అప్పట్లో కేంద్రం నిర్ణయం విమర్శలపాలైంది. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు డిజిటల్ మీడియాపై నియంత్రణకు మరోసారి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే ఇకపై వెబ్ సైట్స్ నిర్వహించడం, అందులో న్యూస్ పోస్టింగ్ లు పెట్టడం అంత ఈజీ కాదు. కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు, ఎలాంటి పుకార్లు ప్రచురించకూడదు. ఒకవేళ తప్పుడు వార్తలు ప్రచురిస్తే, వెంటనే రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశం ఉంది, దానితోపాటు జరిమానా అదనం.

మరింత సమాచారం తెలుసుకోండి: