ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి తప్పు దిద్దుకుంటున్నట్లున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం ఉన్నా జగన్ ఎందుకనో దూరంగానే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాలకే కరోనా వైరస్ సమస్య మొదలైంది. దాంతో రెండుసంవత్సరాలు జగన్ కు జనాలకు పూర్తిగా గ్యాప్ వచ్చేసింది. ఇలా పెరిగిపోయిన గ్యాప్ ను ఇంతకాలానికి జగన్ తగ్గించుకునే నిర్ణయం తీసుకున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెలాఖరులో కానీ లేదా వచ్చే నెలలో కానీ జగన్ ప్రజాదర్బార్ మొదలుపెట్టబోతున్నారు. ప్రతిరోజు ఉదయం జనాలను కలిసి వారిచ్చిన విజ్ఞప్తులను తీసుకుని పరిష్కారంకోసం ఆయా  శాఖలకు పంపుతారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు చేస్తున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఓ రెండుగంటలపాటు జనాలతో ముఖాముఖి కలవబోతున్నారు. అలాగే మధ్యాహ్నంపైన ఎంఎల్ఏలు, నేతలతో భేటీ అవటానికి డిసైడ్ అయ్యారు.

తాజాగా జగన్ తీసుకున్న ప్రజాదర్బార్ నిర్ణయమే తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అడుగుజాడలో నడుస్తున్నట్లు లెక్క. అప్పట్లో వైఎస్ కూడా ప్రతిరోజు ఉదయం తన క్యాంపాఫీసులో జనాలను కలిసేవారు. మధ్యాహ్నం ప్రజాప్రతినిదులు, నేతలతో భేటీ అయ్యేవారు. ఐదేళ్ళపాటు వైఎస్ డైలీ షెడ్యూల్ ఇలాగే ఉండేది. అందుకనే జనాలతో కానీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ కు గ్యాప్ వచ్చిందనే మాట వినబడలేదు.

అప్పట్లో జనాలతో పాటు ప్రజాప్రతినిదులు, నేతలను వైఎస్ కలవగలిగిన పద్దతిలోనే ఇపుడు జగన్ ఎందుకు కలవలేకపోతున్నారు ? ఎందుకంటే టైం మేనేజ్మెంట్లో ఎక్కడో పొరబాటు జరుగుతోంది. చంద్రబాబునాయుడుకి కూడా ఇదే పెద్ద సమస్యగా ఉండేది. అధికారంలో ఉన్నపుడల్లా ఇలాగే వ్యవహరించారు కాబట్టి చంద్రబాబుకు ఎంఎల్ఏలు, జనాలు, నేతలను కలవటం ఇష్టంలేదని అర్ధమైపోయింది.  కానీ జగన్ అలాకాదు కదా. అందుకనే టైం మేనేజ్మెంట్ ముఖ్యం. మొత్తానికి తండ్రి చూపిన బాటలోనే జనాలు, ప్రజాప్రతినిధులు, నేతలను కలవాలని ఇప్పటికైనా నిర్ణయం తీసుకున్నందుకు  సంతోషమే. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందనే అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: