ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ, గుంతలు తేలి ప్రజలకు నరకం చూపెడుతున్నాయంటూ పవన్ కల్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ సోషల్ మీడియాలో జనసైనికులు హడావిడి చేస్తున్నారు. మొదట్లో దీన్ని లైట్ తీసుకున్నా, ఆ తర్వాత వైసీపీ నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, పవన్ కల్యాణ్ కు కౌంటర్లు ఇస్తున్నారు. పిచ్చి మాటలు, వింత చేష్టలు, పనికిమాలిన విమర్శలతో పవన్ జోకర్ లా మారిపోయారని ఎద్దేవా చేశారు మంత్రి దాడిశెట్టి రాజా. జనసేనను జోకర్ సేన అంటూ విమర్శించారు. ా పార్టీకి ఒక సిద్ధాంతం కానీ, రూపు రేఖలు కానీ లేవని అన్నారు రాజా.

గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, అదే సమయంలో జనసేన మాత్రం క్షుద్ర రాజకీయాలు చేస్తోందని మందిపడ్డారు మంత్రి రాజా. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వారమంతా రాజకీయం చేస్తారని, వారికి కాల్షీట్లు ఇచ్చిన పవన్న కల్యాణ్ వారంతాల్లో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వరుసగా మూడు ఆదివారాలు జనవాణి కార్యక్రమం పెట్టడంపై ఆయన పరోక్షంగా సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేశారు.

గతంలో టీడీపీ హయాంలో రోడ్ల నిర్మాణం విషయంలో అవినీతి జరిగిందని, రోడ్లు వేయడానికి తీసుకొచ్చిన అప్పు కాస్తా దారి మళ్లించారని, అందుకే రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, అప్పుడెందుకు పవన్ నోరు మెదపలేదని ప్రశ్నించారు దాడిశెట్టి రాజా. అప్పుడు చంద్రబాబుని ప్రశ్నించని పవన్, ఇప్పుడు వైసీపీని ఎలా ప్రశ్నిస్తున్నారని అడిగారు. అప్పుడు నోట్లో వేలు పెట్టుకుని ఉన్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీ హయాంలో నాసిరకం రోడ్లు వేశారని, అవి వెంటనే పాడైపోయాయని, వైసీపీ వచ్చిన తర్వాత పడ్డ వర్షాలకు మరింతగా గుంతలు తేలాయన్నారు. తమ హయాంలో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు రాజా. అయితే ఆప్రక్రియ జరుగుతుండగానే జనసేన విమర్శలు చేస్తోందని అన్నారు. చంద్రబాబుని ప్రశ్నించకుండా కేవలం జగన్ పై నిందలు మోపడాన్ని ఎలా చూడాలని అడిగారు రాజా. కేవలం చంద్రబాబుకి లబ్ధి చేకూర్చేందుకే, ఆయన్ను అధికారంలోకి తెచ్చేందుకే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: