క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ఓడించాలన్నది జగన్మోహన్ రెడ్డి పట్టుదల. దానికి తగ్గట్లుగా పూర్తి బాధ్యతలు తీసుకున్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో నియోజకవర్గంపై అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి పెద్దిరెడ్డి నూరుశాతం దృష్టిపెట్టారు. దాని ఫలితంగానే సర్పంచ్ ఎన్నికల నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసేసింది. ఇది సరిపోదన్నట్లు టీడీపీ నేతలందరినీ పార్టీలోకి లాగేసుకుంటోంది.





తాజాగా నియోజకవర్గంలోని సుమారు 100 మంది గ్రామస్ధాయి నేతలు వైసీపీలో చేరారు. వారం రోజులక్రితం టీడీపీకి చెందిన 200 మంది వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. మరో రెండేళ్ళల్లో ఎంతమందిని వీలుంటే అంతమంది టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవాలన్నదే పెద్దిరెడ్డి వ్యూహం. 2024 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు తరపున నియోజకవర్గంలో ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళుండకూడదన్నది పెద్దిరెడ్డి ఆలోచనగా కనబడుతోంది. పెద్దిరెడ్డి స్పీడు చూస్తుంటే ఆపని చేసినా చేస్తాడనే అనిపిస్తోంది.





ఇళ్ళపట్టాల పంపిణీ, సంక్షేమపథకాల అమలును నియోజకవర్గంలో పక్కాగా అమలు చేయిస్తున్నారు పెద్దిరెడ్డి. దాంతో మామూలు జనాలతో పాటు పార్టీ జనాలు కూడా వైసీపీ వైపు స్పందిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు ప్రతి రెండు మూడు నెలలకు కుప్పంలో పర్యటిస్తున్నా వలసలు మాత్రం ఆగటంలేదు. టీడీపీ నుండి వైసీపీలో చేరికలను ఎలా అడ్డుకోవాలో చంద్రబాబుకే అర్ధం కావటంలేదు.






కొద్ది సంవత్సరాలుగా తమ మీద పెత్తనం చెలాయించిన వాళ్ళకు, అధికారంలో ఉన్నపుడు అన్నీ విధాలుగా లాభపడి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కిందస్ధాయి నేతలను గాలికి వదిలేసిన వాళ్ళే చంద్రబాబు చుట్టూ ఉన్నారు. కోవర్టులను ఏరేశానని చంద్రబాబు చెప్పేందంతా అబద్ధమని తేలిపోతోంది. చంద్రబాబు కోటరీతో వేగలేమని, వాళ్ళపై వ్యతిరేకతతోనే జనాల్లో బలమున్న నేతలంతా టీడీపీని వదిలేసి వైసీపీలో చేరిపోతున్నారు.  చివరకు కుప్పం టీడీపీలో చంద్రబాబు కోటరీ, కోటరీ మద్దతుదారులు తప్ప ఇంకెవరు మిగిలేట్లు లేరు. అంటే కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయాలన్న జగన్ పట్టుదల నెరవేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: