ఇప్పటికే వరదలతో ఇబ్బంది పడ్డ బాధిత కుటుంబాలకు 2వేల రూపాయల సాయం చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. నిత్యావసరాలు సమకూర్చడంతోపాటు ఆర్థిక సాయం వెంటనే అందించాలన్నారు. అయితే ఈ విషయంలో సీఎం జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఆయన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలవుతాయో లేదో కానీ, కనీస వసతుల విషయంలో మాత్రం ప్రభుత్వ పనితీరు బాగో లేదన్నారు. వరదలతో ఇబ్బంది పడ్డ వేలమంది బాధితులకు నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, కనీసం వారిని తరలించేందుకు పడవలు కూడా సరిగా ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు.

గోదావరి వరద తీవ్రత ప్రస్తుతం కాస్త తగ్గినా.. ముంపు బాధితుల కష్టాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు పవన్ కళ్యాణ్. ఈమేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. వరద బాధితుల కష్టాలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. కేవలం బటన్ నొక్కడంతో సీఎం జగన్ బాధ్యత తీరిపోదని, బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలని సూచించారు పవన్. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వరదల తాకిడికి వందలాది గ్రామాల ప్రజలు తమ ఇళ్లు నీటమునిగి ఇబ్బంది పడుతున్నారని, బాధితుల సంఖ్య వేలలో ఉందని గుర్తు చేశారు. వరదల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం అప్రమత్తంగా లేదని ఆయన విమర్శించారు.

వరద బాధితులను ఆదుకోవాలని జనసేన డిమాండ్ చేస్తుంటే.. రాజకీయం చేస్తున్నారంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోడానికి సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోడానికి పడవలు ఏర్పాటు చేసే విషయంలో కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని అన్నారు. అన్నపూర్ణ లాంటి కోనసీమకు ఈ దుస్థితి ఏంటని, ఆహారం కోసం ప్రజలు పెనుగులాడే పరిస్థితి ఎందుకొచ్చిందని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. జనసైనికులు బాధ్యతగా ముంపు గ్రామాల్లో పని చేస్తున్నారని, వారి సొంత ఖర్చుతో బాధితులకు ఆహారం, పాలు, కూరగాయలు ఇస్తున్నారని, అలాంటి వారి సేవలు అభినందనీయం అని అన్నారు పవన్. అయితే జనసైనికుల్ని సేవ చేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: