గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లంటే వైసీపీ నాయకులకు మరీ చులకన అభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. పై స్థాయి నుంచి కింది స్థాయి నాయకుల వరకు వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలలాగా భావిస్తున్నారు. కనీసం కార్యకర్తలన్నా అభిమానం ప్రేమ ఉంటుంది, కానీ వాలంటీర్లపై అధికారం చెలాయించాలనుకుంటున్నారు వీరంతా. నెలకి 5 వేల రూపాయల పారితోషికం ఇస్తున్నామని, అదంతా తమ జేబులోనుంచే ఇస్తున్నామనే భావన ఉందేమో కానీ, వాలంటీర్లపై ఇటీలవ కాలంలో చాలామంది నోరు పారేసుకున్నారు. వాలంటీర్లు ఎవరు బచ్చాగాళ్లంటూ ఆమధ్య వైసీపీ నేత ఒకరన్నారు. మీరు పెట్టిన వాలంటీర్లే కదా, ఇష్టం లేకపోతే తీసిపారేయండి అంటూ ఇంకొకరు అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు వాలంటీర్లకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.

పని చేయడం చేతగాకపోతే స్వచ్ఛందంగా తప్పుకోండంటూ వాలంటీర్లకు హుకుం జారీ చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఒకవేల అలా చేయకపోతే ప్రభుత్వమై వారిని తొలగిస్తుందని హెచ్చరించారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో వాలంటీర్లకు ఇలా హెచ్చరికలు జారి చేశారు మంత్రి ధర్మాన. రాష్ట్రంలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి 20 లక్షల రూపాయాల నిధులు ఇస్తున్నట్టు తెలిపిన ఆయన, ఇంజినీరింగ్ సిబ్బంది బాధ్యతతో పని చేయాలని సూచించారు. బాధ్యతగా పని చేసి పనులు వేగవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఎస్టిమేషన్లు తొందరగా వేయాలని చెప్పారు.

50 కుటుంబాలకు కూడా సేవ చేయలేని వాలంటీర్లు తమకు అవసరం లేదని అన్నారు మంత్రి ధర్మాన. వాలంటీర్లకు కిరీటం పెట్టే పని ప్రభుత్వం చేస్తోందని అన్నారు ధర్మాన. అయితే కొందరు కింద ఎసరు పెట్టేపని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్‌ పని కష్టం అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోండని సలహా ఇచ్చారు ధర్మాన. లేకపోతే తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. పనిచేయాలనుకే వాలంటీర్లు తప్పనిసరిగా 50 కుటుంబాల బాధ్యత తీసుకోవాలన్నారు ధర్మాన.

కాంట్రాక్టర్లను భయపెట్టాల్సిందే..
కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు జరగవని చెప్పారు ధర్మాన ప్రసాదరావు. అవసరం అయితే కొంతమంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌ లో పెట్టాలని సూచించారు ధర్మాన. గతంలో మాదిరిగా పనులతో కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో లాభాలు రావాలంటే కుదరదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: