జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మెల్లిగా తత్వం బోధపడుతున్నట్లుంది. ఎన్నికల్లో ఓట్లు రావాలన్నా, గెలవాలన్నా సామాజికవర్గాల మద్దతు ఎంత అవసరమో ఇపుడు తెలుస్తున్నట్లుంది. ఒకవైపు తనకు కులం లేదు, మతంలేదు అని చెప్పుకున్న పవన్ ఇపుడు కుల భావనపై పెద్ద లెక్షర్లే ఇస్తున్నారు. కులభావన ఉండటంలో తప్పులేదని, ఏ కులం వాళ్ళు ఆ కులానికి చేసుకోవటంలో  కూడా తప్పేమీలేదన్నారు.






అంటే అర్ధమేమిటంటే తాను కాపు కులస్తుడిని కాబట్టి కాపులంతా తనకు మద్దతివ్వాలని పరోక్షంగా అడగటమే. సరే సొంత సామాజికవర్గమైన కాపుల ఓట్లను అడగటంలో తప్పేమీలేదు. అయితే ఇదే సమయంలో క్షత్రియ సామాజికవర్గం ఓట్లకు కూడా పవన్ గాలమేస్తున్నట్లుంది. భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రభుత్వం వేధిస్తున్నదంటే యావత్ క్షత్రియుల కులాన్ని వేధిస్తున్నట్లుగానే తాను చూస్తున్నట్లు చెప్పారు. ఇక్కడే పవన్లోని అజ్ఞానం బయటపడుతోంది.





ఎలాగంటే రఘురాజును రాజుల సామాజికవర్గంలోనే చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తారు. రఘురాజేమీ క్షత్రియ సామాజికవర్గానికి పెద్ద దిక్కుకాదు. రఘురాజుకు మద్దతుగా నిలవటం వల్ల క్షత్రియుల ఓట్లన్నీ హోలుసేల్ గా జనసేనకు పడిపోతాయని అనుకుంటున్నట్లున్నారు. మొన్నటి ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓడిపోయారంటే అర్ధమేంటి ? అన్నీ సామాజికవర్గాలు కూడా తనను వ్యతిరేకించన కారణంగానే తాను ఓడిపోయిన విషయం పవన్ గ్రహించటంలేదేమో.





అనేక కారణాల వల్ల భీమవరం, కాకినాడ, రాజోలు, తుని, నరసాపురం లాంటి నియోజకవర్గాల్లో కాపులకు రాజులకు ఏమాత్రం పడదు. సినిమాల విషయంలోనే ప్రభాస్ ఫ్యాన్స్-పవన్ ఫ్యాన్స్ కు మధ్య కాకినాడ, భీమవరంలో జరిగిన గొడవలు అందరికీ తెలుసు. కాబట్టి రఘురాజును అడ్డం పెట్టుకుని రాజుల మద్దతుకు పవన్ ప్రయత్నించటం దండగే అవుతుందేమో. మొన్నటి ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజుల్లో అత్యధికులు వైసీపీకి మద్దతిచ్చింది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో రాజుల మద్దతుకోసం పవన్ గాలమేస్తున్నదీ నిజం. మరి ఇందులో పవన్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.  




మరింత సమాచారం తెలుసుకోండి: