గుక్కెడు మంచినీళ్ళు కూడా ఈరోజుల్లో చాలా ఖరీదైనవి..అలాంటిది పాలను ఊరికే ఇవ్వడం. అంటే మాటలు కాదు..కానీ ఓ ఊరిలో ఊరికే పాలు పోస్తున్నారు.. నిజమే.. ఆ ఊరిలో పాలు పొసినందుకు డబ్బులు ఇచ్చిన ఎవరూ తీసుకోరు.ఆ ఊరు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని పిన్నాపురం ఓ మారుమూల గ్రామం. 421 ఇళ్లు 1800 జనాభా కలిగిన ఈ ఊరిలో 344 బర్రెలు, 815 ఆవులు, 2444 మేకలు ఉన్నాయి. ఇక్కడ తాతల కాలం నుంచి పశు పోషణ సంప్రదాయంగా వస్తోంది. గ్రామ జనాభాలో దాదాపు 80 శాతం మంది పాడిపెంపకందారులే. సమీపంలోని కొండ ప్రాంతాల్లో వాటిని పెంచుకుంటూ తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఎవ్వరూ పాలు విక్రయించరు. పశుపోషకులు తమ కుటుంబ అవసరాలకు పోనూ మిగిలిన వాటిని గ్రామస్తులకు ఉచితంగా ఇస్తారు.


ముఖ్యంగా గర్భి ణులు, బాలింతలు ఉన్న ఇళ్లకు వారే స్వయంగా పాలు పంపిస్తుంటారు. ఎవరైనా వారి ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే సమీపంలోని పట్టణం నుంచి పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఇక్కడి గ్రామ ప్రజలు పొద్దున్నే గ్లాసుడు కాఫీ లేదా టీ తాగడంతో దిన చర్య మొదలు పెడతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ వాడుతారు. ఇందుకు అవసరమైన పాలు గ్రామంలోనే ఉచితంగా లభిస్తుండటం విశేషం. అవసరాల్లో ఒకరికొకరు సహాయపడాలన్నదే ఈ సంప్రదాయం ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు తెలిపారు.. గ్రామంలో పాలు ఉచితంగా పోసే ఆచారం మా తాతల కాలం నుంచి ఉంది. అలా మా పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. చాలా కుటుంబాల్లో ఇంటి అవసరాలకు మించే పాలు ఉంటాయి. గ్రామంలో పాడిలేని వారు ఎవరైనా ఉన్నారని తెలిస్తే వారు అడగకుండానే పాలు పంపిస్తాం. దీని వల్ల మాకు మంచి జరుగుతుందని నమ్మకం...ఇప్పుడు ఆ ఊరు అందరికి ఆదర్సంగా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: