గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఏపీలో గుంతల రోడ్లపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. రెండురోజులపాటు హడావిడి బాగానే సాగింది. స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొని సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. కార్టూన్లతో సోషల్ మీడియాలో సందడి చేశారు. కానీ ఇప్పుడా వేడి, ఉత్సాహం ఏమయ్యాయి. రెండు రోజులకే గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం పూర్తయిందా, లేక ఏపీలో రోడ్లన్నిటికీ రిపేర్లు పూర్తయ్యాయా..? రెండురోజులు హడావిడి చేసిన జనసేన నేతలు ఇప్పుడేం చేస్తున్నారు..?

ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన నేతలు మొదలు పెట్టిన డిజిటల్ క్యాంపెయిన్ హంగామా తొలి రెండురోజులు బాగానే సాగింది. సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ బాగానే ట్రెండ్ అయింది. ఏయే ప్రాంతాల్లో గుంతల రోడ్లు ఉన్నాయి, ఏయే ఏరియాల్లో ఎలాంటి రోడ్లు ఉన్నాయో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అంతలోనే కొన్ని చోట్ల రిపేర్ వర్క్ లు కూడా మొదలయ్యాయి. అయితే పూర్తిగా అంతా పరిస్థితి బాగుపడిందని అనుకోలేం. కానీ అంతలోనే ఆ కార్యక్రమం మాత్రం నీరసించింది.

పవన్ ఉండాల్సిందేనా..?
పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో కొన్నిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు అందువల్లే గత ఆదివారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం కూడా ఆగిపోయింది. దీంతో పవన్ సైలెంట్ అయ్యారు, ఆటోమేటిక్ గా జనసైనికులు కూడా సైలెంట్ అయ్యారు. ప్రతి విషయంలో పవన్ కల్యాణ్ ముందుండాలి, ఆయనే ముందుండి నడిపించాలంటే కుదరదు. పోనీ జనసైనికులకు దిశా నిర్దేశం చేసే ద్వితీయ శ్రేణి నాయకత్వం అయినా పటిష్టంగా ఉందా అంటే అదీ లేదు. నాదెండ్ల మనోహర్ కాస్తో కూస్తో జనంలోకి వెళ్తున్నారు. నాగబాబు కొన్నిరోజులు బాగా యాక్టివ్ గా ఉంటారు, మరికొన్నిరోజులు పూర్తిగా సైలెంట్ అయిపోతారు. మొత్తమ్మీద జనసేనలో పవన్ కల్యాణ్ ముందడుగు వేస్తేనే మిగతావాళ్లు కూడా కదులుతారు. లేకపోతే ఏదీ లేదు అని తేలిపోయింది. అటు వైసీపీ నాయకులు కూడా అందుకే ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు.

గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నాలుగైదు రోజులు నిరసన తెలిపిన జనసైనికులు దాన్ని కొనసాగిస్తూ రోడ్లు బాగయ్యే వరకు ఏమైనా కార్యాచరణ ప్రకటించారా లేదా అనేది తేలాల్సి ఉంది. గుంతల రోడ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోపాటు, వాటి బాగుకోసం కార్యాచరణ రూపొందించి ఉంటే జనసేనకు మైలేజీ పెరిగి ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: