తెలంగాణ మంత్రి, అందులోనూ ఆయన ఐటీ మంత్రి.. అలాంటి మంత్రి వాట్సప్ బ్లాక్ అయితే ఇంకేమైనా ఉందా..? కానీ కేటీఆర్ వాట్సప్ బ్లాక్ అయింది. రోజులో మూడుసార్లు క్రాష్ అయింది. దీన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన వాట్సప్ క్రాష్ అయిందని రోజులో మూడుసార్లు మెసేజ్ లతో హ్యాంగ్ అయిపోయిందని చెప్పారు కేటీఆర్.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తెలసినవారు కూడా ఆయనకు వాట్సప్ ద్వారా మెసేజ్ లు పెట్టాలనుకున్నారు. దీంతో ఆయన వాట్సప్ కి కుప్పలు తెప్పలుగా మెసేజ్ లు వచ్చాయి. ఆయన కాలి గాయంతో ఇంటిలో రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి స్వయంగా వెళ్లి కలిసేందుకు ఎవరికీ అవకాశం లేదు. అందుకే ఆయనకు ఫోన్లోనే శుభాకాంక్షలు తెలపాలనుకున్నారంతా. అందరూ వాట్సప్ ద్వారా శుభాకాంక్షలు పంపించడం, వాటన్నిటికీ సమాధానం చెప్పాలని కేటీఆర్ అనుకోవడంతో ఆయన వాట్సప్ కాస్తా క్రాష్ అయింది. ఒకేసారి  8వేల మెసేజ్ లు రావడంతో దాన్ని ఆయన వాట్సప్ తట్టుకోలేకపోయింది. మూడుసార్లు వాట్సప్ క్రాష్ కావడంతో కేటీఆర్ కూడా విసిగిపోయారు. డిజిటల్ ఛాలెంజెస్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ని జత చేసి తన వాట్సప్ ఆగిపోయిందనే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కేటీఆర్ కి ఇటీవల కాలికి గాయమైంది. ఆయన కాలి కట్టుతోనే ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈలోగా ఆయన పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజున ఎవరూ తనను కలవొద్దని, బొకేలు, పూలదండలు, స్వీట్లకోసం చేసే ఖర్చుని పేదలకోసం ఖర్చు పెట్టాలని చెప్పారాయన. గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టండని చెప్పారు. అలాగే చాలామంది అభిమానులు గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. ఇటు కేటీఆర్ కూడా ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవడంలేదు. ఆయన ఫైళ్లతో కుస్తీలు పడుతున్నారు. ఆఫీస్ వర్క్ ని కూడా ఇంటినుంచే చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేసి, తాను ఇంటి నుంచి పని చేస్తున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: