ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాతలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజుల గ్యాప్ తో రెండోసారి తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాలు, చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాకాలం మొదలైనట్టే కనపడుతోంది. అటు గోదావరి జిల్లాల్లో వరద ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఇద్దరి పర్యటనలు పూర్తయ్యాయి. ఇటు కోస్తా జిల్లాల్లోల వచ్చే మూడు రోజులు కీలకం అంటున్నారు అధికారులు.

రాబోయే మూడు రోజులు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. కోస్తా జిల్లాలతోపాటు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. బుధవారం నుంచి మరో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

అటు పశ్చిమగోదావరి, కాకినాడ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అత్యథికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొగల్తూరులో 5.8 సెం.మీ. కాకినాడలో 5.7 సెం.మీ, తాళ్లరేవులో 5.3 సెం.మీ, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సీఎం జగన్ పర్యటనలో ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా వర్షం కురిసింది. సీఎం జగన్ వర్షంలోనే తన పర్యటన ముగించారు. మంగళవారం అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా రేవూరులో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే మరో మూడు రోజులపాటు ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: