వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు చంద్రబాబునాయుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకవిధంగా ఇద్దరికీ వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవనే చెప్పాలి. రెండుపార్టీల్లో ఓడిపోయిన పార్టీకి ఇబ్బందులు ఎలాగుంటాయో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే భవిష్యత్తు దాదాపు ముగిసిపోయినట్లే. అదే వైసీపీ ఓడిపోతే జగన్ కు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సుంటుంది.





విచిత్రమేమిటంటే ఎన్నికల్లో ఓడిపోతే జరగబోయేదేమిటో ఇద్దరికీ బాగా తెలుసు. అందుకనే గెలుపుకోసం ఇద్దరు విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నారు. సరే వీళ్ళ ప్రయత్నాలు ఎలాగున్నా కీలకమైన పాయింటు ఒకటుంది. అదేమిటంటే పార్టీలపరంగా వైసీపీకి, టీడీపీకి దేని ఓటుబ్యాంకు దానికుంది. కాబట్టి ఆ ఓటుబ్యాంకుకు ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే జనసేనకు కూడా కొద్దోగొప్పో ఓటుబ్యాంకు ఉంటుందనటంలో సందేహంలేదు.





ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ఓటుబ్యాంకు గురించి చెప్పుకోవాల్సిన అవసరమేలేదు. అయితే పార్టీలపరంగా ఉన్న ఓటుబ్యాంకులను తీసేస్తే కీలకమైనది న్యూట్రల్ ఓట్లు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా న్యూట్రల్ ఓట్లే అత్యంత కీలకం. న్యూట్రల్ ఓటుబ్యాంకు ఎంత తక్కువ వేసుకున్నా 30 శాతం ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లొచ్చినా, టీడీపీకి 38 శాతం ఓట్లొచ్చినా ఇందులో పార్టీల ఓటుబ్యాంకులతో పాటు న్యూట్రల్ ఓట్లుకూడా కలిసే ఉంది.





అలాగే తర్వాత జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీ ఓటుషేర్ దాదాపు 60 శాతం దాటింది. ఇందులో కూడా న్యూట్రల్ ఓట్లే కీలకం. అయితే ఎన్నికలు జరిగి మూడేళ్ళు దాటిన నేపధ్యంలో ప్రభుత్వంపైన, టీడీపీపైన వ్యతిరేకతో లేకపోతే సానుకూల అభిప్రాయమో కలగటం సహజం. సో న్యూట్రల్ ఓట్లలో జగన్ బాగానే పనిచేస్తున్నారని అనుకుంటే పడేఓట్లపైనే వైసీపీ గెలుపు ఆధారపడుంది. ఇదే సమయంలో జగన్ లాభంలేదని న్యూట్రల్ ఓటుబ్యాంకు  అనుకుంటే ప్రతిపక్షాల్లో టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఎవరికి ఓట్లేస్తారనేది కీలకం. ఇందుకనే జగన్, చంద్రబాబు న్యూట్రల్స్ ఓటుబ్యాంకు కోసమే నానా అవస్తలు పడుతున్నారు. మరి న్యూట్రల్స్ ఎవరిని కరుణిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: