తెలుగుదేశంపార్టీ పరిస్దితి మరీ అన్యాయంగా తయారైపోయింది. ప్రపంచంలోనే ఎంతో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పాపులరైన తిరుపతిలో టీడీపీకి అభ్యర్ధి లేరంటే ఏమనుకోవాలి. తిరుపతి నియోజకవర్గంలో నాలుగు ఎన్నికల్లోను రెండుసార్లు ఉపఎన్నికల్లోను గెలిచిన చరిత్ర టీడీపీకి ఉంది. బలమైన క్యాడర్ కూడా ఉన్నట్లే లెక్క. అయినా వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయటానికి గట్టి అభ్యర్ధే దొరకటంలేదట. ఈ విషయం తిరుపతి నియోజకవర్గంలోని నేతలతో జరిగిన సమీక్షలో బయటపడింది.





ఇపుడు ఇన్చార్జిగా మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మున్నారు. అయితే ఆమె మీద బాగా బ్యాడ్ ఇమేజుంది. అధికారపార్టీతో తెరవెనుక ఒప్పందాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉంది. దాంతో ఆమెను చంద్రబాబునాయుడు కానీ ఇతర సీనియర్ నేతలుకానీ నమ్మేస్ధితి లేదు. దాంతో ప్రత్యామ్నాయంగా ఎవరిని చూడాలనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎంత వెతికినా గట్టి అభ్యర్ధే దొరకటంలేదు. వచ్చే ఎన్నికల్లో ఎంత తక్కువేసుకున్నా కనీసం 40-50 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.





ఇంత భారీమొత్తాన్ని ఖర్చు చేసేంత సీనున్న నేతలు టీడీపీలో లేరని తేలిపోయింది. అలాగని సుగుణమ్మకే టికెట్ ఇద్దామనుకంటే ఆమెమీద నమ్మకంలేదు. ఈ పరిస్దితుల్లో ఏమిచేయాలో చంద్రబాబుకు పాలుపోవటంలేదు. మొన్నటి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో జరిగింది చూసినతర్వాత మొత్తం తమ్ముళ్ళందరిపైనా చంద్రబాబుకు అనుమానాలు పెరిగిపోయాయి. పార్టీకి కమిటెడ్ గా పనిచేసే నేతలు ఎవరున్నారనే విషయంలో టార్చిలైట్ వేసి వెతుకుతున్నారట.





షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది 20 నెలలు మాత్రమే. ఈలోగా గట్టి అభ్యర్ధిని వెతికి పట్టుకోవాలి, ఎన్నికల్లో పోటీచేసేందుకు రెడీచేయాలంటే పార్టీకి కష్టమైన పనిగానే ఉంది. డీకే ఆదికేశవుల నాయుడు కొడుకు శ్రీనివాసుల నాయుడుని పోటీచేయించాలని అనుకున్నారు. అయితే ఈమధ్యనే బెంగుళూరులో ఏదో కేసులో ఇరుక్కున్నారు. దాంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. దాంతో ప్రత్యామ్నాయం కూడా కనబడటంలేదు. తిరుపతి లాంటి నియోజకవర్గంలోనే టీడీపీకి ఇలాంటి పరిస్దితుంటే ఇక మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్దితి ఏమిటో అర్ధమైపోతోంది. అందుకనే తమ్ముళ్ళతో చంద్రబాబు భేటీలపైన భేటీలు నిర్వహిస్తున్నారు. మరి బలమైనఅభ్యర్ధి ఎప్పుడు దొరుకుతారో ఏమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: