ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. మునుగోడు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరలేదు. అయినా జరగబోయే ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుస్తారా ? ఓడుతారా ? అనే చర్చ మొదలైపోయింది. రాజగోపాలరెడ్డి విషయంలో ఇంత హడావుడి ఎందుకు జరుగుతోంది ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి పార్టీలో చేరాలని బీజేపీ గట్టిగా చెబుతోంది. అయితే పార్టీకి రాజీనామా చేస్తాను కానీ ఎంఎల్ఏ పదవికి కాదని రాజగోపాల్ చెబుతున్నారట.

ఈ విషయంలోనే జనాల్లో ఆసక్తి పెరిగిపోతోంది. ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి గెలవచ్చు కదా అన్నది బీజేపీ సీనియర్ల వాదన. అయితే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తే జరగబోయే ఉపఎన్నికలో గెలుపు అంత గ్యారెంటీలేదని కోమటిరెడ్డికే అనుమానంగా ఉందట. దీనికి కారణం ఏమిటంటే  ఆయన మద్దతుదారుల్లో ఎవరు కూడా కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరటానికి సిద్ధంగా లేరట. ఎంఎల్ఏ నిర్వహించిన భేటీలో మద్దతుదారులు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారట. మద్దతుదారులంతా కాంగ్రెస్ కే పనిచేస్తే తన పరిస్దితి ఏమిటనేది రాజగోపాల్ కు అర్ధంకావటంలేదు.


మరి సైన్యంలేకుండా రాజు ఒక్కడే యుద్ధాన్ని ఎలా గెలవగలరు ? ఇపుడిదే విషయమై రాజగోపాల్ ను పెద్ద అయోమయంలోకి నెట్టేస్తోందట. ఇదే సమయంలో కేసీయార్ ను ఇబ్బందుల్లోకి నెట్టాలంటే కొంతమంది ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు తెప్పించి గెలవాలనేది బీజేపీ ఆలోచన. ప్రతి ఉపఎన్నికలోను బీజేపీ గెలిచి కేసీయార్ పనైపోయిందని, అధికారంలోకి రాబోయేది తామేఅని చాటిచెప్పాలనే ఆతృతలో బీజేపీ నేతలున్నారు. అయితే ప్రతి ఉపఎన్నికలోను బీజేపీనే గెలుస్తుందనే గ్యారెంటీ ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు.


సరే ఏదేమైనా ఉపఎన్నికలో గెలుపుపై గ్యారెంటీ లేకనే పార్టీకి మాత్రమే రాజీనామా చేసి ఎంఎల్ఏగా కంటిన్యు అవ్వాలని రాజగోపాల్ అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే నియోజకవర్గంలో ఆరాతీస్తే రాజగోపాల్ గెలుపు అనుమానమే అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలవటానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ బలంగా ఉందికానీ బీజేపీకి బలమంటు ఏమీలేదు. మరి రేపటి ఎన్నికల్లో రాజగోపాల్ ఓడిపోతే బీజేపీ పరిస్దితి ఏమిటి ?
మరింత సమాచారం తెలుసుకోండి: