చాలామంది అనుమానిస్తున్నట్లే బీజేపీ పావులు కదుపుతోంది. శివసేనలో బిగ్ ఫిష్ అయిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకుంది. రౌత్ ను అదుపులోకి తీసుకోవటమంటే దాదాపు అరెస్టు చేసినట్లే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెయ్యికోట్ల రూపాయల ల్యాండ్ స్కాంలో రౌత్ ను ఈడీ తనింట్లోనే అదుపులోకి తీసుకుంది. ఆదివారం ఉదయమే ఇంటిపైన దాడిచేసి అధికారులు కొన్నిగంటలపాటు సోదాలు జరిపారు.





సరే దాడి చేయటమే ప్రత్యేకమైన టార్గెట్ పెట్టుకుని చేశారు కాబట్టి సాయంత్రం అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంపీ కూడా దీన్ని ముందునుండే ఊహించారు కాబట్టి పెద్దగా గాభరాపడలేదు. ఏక్ నాధ్ షిండే శివసేన ప్రభుత్వాన్ని కూల్చేసిన వెంటనే బీజేపీ తర్వాత టార్గెట్ రౌతే అని అందరికీ అర్ధమైపోయింది. దానికి తగ్గట్లే థాక్రే ప్రభుత్వం పూర్తిగా కూలిపోకముందే ఈడీ రౌత్ కు రెండుసార్లు నోటీసులిచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లోనే రౌత్ కు అత్యంత సన్నిహితుల్లో కొందరని అరెస్టు చేయటమే కాకుండా ఆస్తులను కూడా ఎటాచ్ చేసుకున్నది.





మొత్తానికి తెరవెనుక నిలబడి బీజేపీ పెద్దలు తమ పంతాన్ని నెరవేర్చుకున్నారు. ఇక్కడ స్కాం జరిగలేదని చెప్పేందుకు లేదు. ఇదేసమయంలో నిజంగానే స్కాములు చేస్తున్నవారిందరిపైనా ఈడీ దాడులుచేసి అరెస్టులు చేస్తోందా అంటే అదీలేదు. ఉదాహరణ తీసుకుంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వేలాది కోట్లరూపాయలు ఖర్చుచేసి  నాలుగు జాతీయ రహదారులను నిర్మించారు. ఈ నేషనల్ హైవే రోడ్లన్నీ వేసిన పదిరోజులకు, ఆరుమాసాల్లోగా ఎంత నాశిరకమైనవో బయటపడ్డాయి. వేలకిలోమీటర్ల రోడ్లు భారీవర్షాలకు కుంగిపోవటంతో పాటు పెద్ద పెద్ద గుంతలుపడిపోయాయి.






అంత నాశిరకంగా రోడ్లు వేసినందుకు కాంట్రాక్టర్లను, ఉన్నతాధికారులను, మంత్రులపై ఈడీ ఎందుకు దాడులుచేసి అదుపులోకి తీసుకోలేదు. పైగా యూపీలో జాతీయ రహదారిని స్వయంగా నరేంద్రమోడీ ఈమధ్యనే ఓపెన్ చేశారు. పై రాష్ట్రాల్లో ఈడీ ఎందుకు దాడులు చేసి కేసులు పెట్టలేదంటే రెండింటిలోను బీజేపీ అధికారంలో ఉందికాబట్టే అని అందరికీ అర్ధమవుతోంది. మొత్తానికి ఇంతకాలానికి ఈడీ బిగ్ ఫిష్ నే పట్టుకుంది. అరెస్టు తర్వాత యాక్షన్ ఏమిటి ? తర్వాత టార్గెట్ ఎవరో కూడా తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: