అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించకపోతే ఏమవుతుందో చంద్రబాబునాయుడును చూసి నేర్చుకోవాలి. అయితే కళ్ళెదుటో ఉదాహరణలు కనిపిస్తున్నా మంత్రి అంబటి రాంబాబు మాత్రం ఏమీ నేర్చుకున్నట్లు లేదు. తమ దగ్గరకు వచ్చిన మంత్రి, ఎంఎల్ఏని జనాలు అనేకమడుగుతారు. దానికి ఇష్టం వుంటే సమాధానం చెప్పాలి లేకపోతే మౌనంగా వచ్చేయాలి. అయితే అంబటి మాత్రం నోరుపారేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే  గడపగడపకువైసీపీ కార్యక్రమంలో అబంటి రాజుపాలెం గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడారు. ఆ సమయంలో ఒకవ్యక్తి తమకు రోడ్డు కావాలని అడిగారు.






మంత్రిపక్కన ఉన్నవారు సదరు వ్యక్తి తెలుగుదేశంపార్టీ మనిషని చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి టీడీపీనా అయితే రెడ్డిచ్చేదిలేదయ్యా అని అన్నారు. ఒకవైపేమో సంక్షేమపథకాల అమలులో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం పార్టీ చూడదు, మతం చూడదు, ప్రాంతం చూడదని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి తాజాగా మంత్రి చెప్పిన సమాధానం జగన్ ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ఉంది.







సంక్షేమపథకాలు అమలుచేసినా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మొత్తం ప్రజలు కట్టే పన్నులతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరూ తమ జేబుల్లోనుండి డబ్బుతీసి ఖర్చుపెట్టరు. గతంలో చంద్రబాబునాయుడు కూడా ఇలాగే మాట్లాడారు. కర్నూలు జిల్లాలో పర్యటించినపుడు మేము వేసిన రోడ్లపైన తిరుగుతు, మేమిచ్చిన ఫించన్లు తీసుకుంటు, మేమిచ్చే రేషన్ తీసుకుంటు టీడీపీకి ఓట్లేయరా అంటు జనాలపై మండిపోయారు.







అప్పటి వైసీపీ ఎంఎల్ఏ గౌరుచరిత అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగినపుడు వైసీపీ వాళ్ళు అడిగితే ఎలా చేస్తానని బహిరంగంగా రోడ్డుషోలో చెప్పారు. పైగా మైకులో మాట్లాడుతు వైసీపీ వాళ్ళడిగితే మనం చేయాలా తమ్ముళ్ళు అంటు జనాలనే ప్రశ్నించారు. దాని ఫలితం తర్వాత ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. రేపు అంబటికి అయినా ఇదే వర్తిస్తుంది. రోడ్డువేయటం ఇష్టంలేకపోతే ఏదో కారణం చెప్పి తప్పుకోవాలి కానీ టీడీపీ వాళ్ళడిగితే రోడ్డెలా వేస్తామంటే అర్ధంలేదు. వేసిన రోడ్డుమీద టీడీపీ వాళ్ళే తిరుగుతారా ? లేకపోతే వైసీపీ నేతలు మాత్రమే తిరుగుతారా ? వచ్చే ఎన్నికల్లో జనాలు తామేంటో చూపిస్తే కానీ అంబటికి  బుద్ధిరాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: