షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. ఈ టెన్షన్ కు అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా మూడు కారణాలను పార్టీవర్గాలే చెబుతున్నాయి. అవేమిటంటే కేంద్రప్రభుత్వం నుండి సహాయ నిరాకరణ. జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది.  ఇదే సమయంలో మంత్రులు, ఎంఎల్ఏలపైన అవినీతి ఆరోపణలు పెరిగిపోతుండటం. ఈ మూడింటి కారణంగానే కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోందట.





ప్రభుత్వ పనితీరు, మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ సర్వేల్లో ఎక్కవసార్లు ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత ఉన్నట్లు బయటపడుతోంది. దాంతో మెజారిటి ఎంఎల్ఏలను మార్చాల్సిందే అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) రిపోర్టులో స్పష్టంచేసినట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే నియోజకవర్గాలను ఎంఎల్ఏలకు రాసిచ్చేశారు. దాంతో ఏమైందంటే తమ నియోజకవర్గాల్లో బదిలీలు, భూకబ్జాలు తదితర సెటిల్మెంట్లలో ఎంఎల్ఏల జోక్యం పెరిగిపోయిందనే ఆరోపణలు బాగా ఎక్కువైపోయాయి.





ఇదే సమయంలో నరేంద్రమోడీతో యుద్ధమని మరోటని కేసీయార్ చేసిన ప్రకటనలతో కేంద్రప్రభుత్వం నుండి సహాయనిరాకరణ మొదలైంది. రాష్ట్రం చేయాల్సిన అప్పులను కేంద్రం బిగించేస్తోంది. దాంతో ఒకపుడు ధనికరాష్ట్రమని చెప్పుకున్న తెలంగాణా 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవటంతో పాటు ఇపుడు అప్పులు దొరకటమే కష్టమైపోయింది. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కూడా కష్టమైపోతోంది. కేసీయార్ అంటే వణికిపోతున్న మీడియా క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను బయటపెట్టటంలేదు.





ఇది సరిపోదన్నట్లు కేసీయార్ పై బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. టీఆర్ఎస్ నేతలను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాంతో పార్టీలో నుండి ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు ఏరోజు ఎవరు బీజేపీలో చేరిపోతారో అర్ధం కావటంలేదు. తమకు ఖాయంగా టికెట్లు రావని అనుకుంటున్న వారిలో కొందరు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నట్లు కావాలనే కమలంనేతలు లీకులిస్తున్నారు. దాంతో టీఆర్ఎస్ తో పాటు ఆయా నియోజకవర్గాల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఇదే సమయంలో కొందరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీయార్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: