మహారాష్ట్రలో తాజా  రాజకీయ పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒక్కసారిగా శివసేన చీఫ్ ఉత్థవ్ థాక్రేపై తిరుగుబాటుచేసిన ఏక్ నాథ్ షిండే పార్టీని చీల్చటంతో పాటు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీ కూడా తెరముందుకు వచ్చి షిండేతో కలవటంతో ప్రభుత్వాన్ని కూల్చేయటం షిండేకి చాలా తేలికైంది. అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత షిండే అనూహ్యంగా ముఖ్యమంత్రయిపోయారు.






సీఎం అయ్యేంతవరకు బాగానే ఉన్న షిండేకి ఆ తర్వాత సమస్యలు మొదలయ్యాయట. థాక్రే నుండి ఎంఎల్ఏలను లాక్కోవటానికి అందరికీ మంత్రిపదవులను షిండే ఎరగా వేశారట. షిండే హామీలు నమ్మిన వారందరు థాక్రే నుండి బయటకు వచ్చేశారు. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని దాదాపు నెలరోజులుఅవుతున్నా ఇంతవరకు మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. కారణం ఏమిటంటే  షిండే వర్గంలోని ఎంఎల్ఏలంతా మంత్రిపదవుల కోసం పట్టుబడుతున్నారట. ఇదే విషయమై వాళ్ళమధ్య పెద్ద వాగ్వాదమే జరిగినట్లు సమాచారం.





మహారాష్ట్రలో 288 ఎంఎల్ఏ స్ధానాలున్నాయి. దీనిప్రకారం 44 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. షిండేకి సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఎలాగంటే బీజేపీ భాగస్వామ్యంతో సీఎం అయిన కారణంగా మెజారిటి మంత్రిపదవులు బీజేపీ తీసుకుంటోందట. షిండే వర్గంలో 40 మంది ఎంఎల్ఏలుంటే బీజేపీకి 106 మంది ఎంఎల్ఏలున్నారు. ఈ దామాషాలోనే మంత్రిపదవులు కూడా పంచుకోవాలని బీజేపీ చెప్పేసిందట. అంటే బీజేపీకి సుమారుగా 30, షిండేవర్గానికి 14 మంత్రిపదవులు రావచ్చు.  దాంతో షిండేకి ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు.






తమకిస్తానని హామీఇచ్చిన మంత్రిపదవులు తమకిచ్చి తీరాల్సిందే అని షిండేవర్గం ఎంఎల్ఏలందరు నెత్తిమీద కూర్చున్నారు. దీంతో హఠాత్తుగా షిండేకి బీపీ పెరిగిపోయి అనారోగ్యం మొదలైందట. దాంతో సచివాలయానికి కూడా వెళ్ళకుండా మూడురోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. ఎంఎల్ఏలకు ఇచ్చిన మంత్రిపదవుల హామీని షిండే నిలుపుకునే అవకాశంలేదని తేలిపోయింది. దాంతో తిరుగుబాటు వర్గంలో మంత్రిపదవులు రానివారు ఏమిచేస్తారో అనే టెన్షన్ షిండేలో పెరిగిపోతోంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు భలే మలుపులు తిరుగుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: