ఒకపుడు కేంద్రప్రభుత్వం మీద సమరశంఖం పూరిస్తున్నట్లు చెప్పారు. తర్వాత నరేంద్రమోడీ మీద యుద్ధమన్నారు. ఆ తర్వాత చాలానే చెప్పారు. తీరాచూస్తే ఇపుడు పూర్తిగా చప్పపడిపోయారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కేసీయార్లో మెరుపులు లేవు, ఉరుములు లేవు చివరకు పంచ్ డైలాగులు కూడా లేవు. నరేంద్రమోడీ పాలనగురించి దేశమంతా చెప్పుకుంటున్నదాన్నే కేసీయార్ మీడియా సమావేశంలో చెప్పారంతే. అదికూడా చాలా చప్పగా పత్యం తిండిలాగ చెప్పారు.





నరేంద్రమోడీ అంటేనే ఒకపుడు పెట్రోల్లో పోసిన మంటలాగ ఎగిరెగిరిపడే సీఎం ఇపుడెందుకు ఇంతచప్పగా మాట్లాడారో అర్ధంకావటంలేదు.  కేంద్రప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆదివారం ఢిల్లీలో జరిగే నీతిఅయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. నీతిఅయోగ్ సమావేశాన్ని కేసీయార్ బహిష్కరిస్తే మోడీకి వచ్చే నష్టమేమిటి ? నిజంగానే కేసీయార్లో చిత్తశుద్దుంటే సమావేశానికివెళ్ళి హైదరాబాద్  మీడియా సమావేశంలోమాట్లాడింది మాట్లాడాలి. అప్పుడు యావత్ దేశమంతా కేసీయార్ వైపు చూస్తుంది.





నీతిఅయోగ్ నిరర్ధకసంస్ధగా మారిపోయిందన్నారు. నేతిబీరకాయలలో నెయ్యి ఎంతుంటుందో నీతిఅయోగ్ లో నీతి అంతే ఉందన్నారు. నీతిఅయోగ్ సిఫారసులను కేంద్రప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదని మండిపోయారు. మూడు వ్యవసాయ చట్టాల కారణంగా రైతులు పెద్దఎత్తున ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వందలాదిమంది రైతులు చనిపోయిన తర్వాత చట్టాలను రద్దుచేసినందుకు మోడీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ హయాంలో యావత్ దేశమంతా నాశనమైపోతోందన్నారు. అప్పులు తీసుకున్న రైతులను చావగొడుతున్న కేంద్రం మరోవైపు కార్పొరేట్లు తీసుకున్న రు. 12 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేయటంపై మండిపోయారు.






హోలుమొత్తంమీద మోడీ పాలనంతా మన్నూ, మశానమే అంటు ఎద్దేవాచేశారు. అంతాబాగానే ఉంది కానీ ఇపుడు చెప్పిందేదో ఢిల్లీ సమావేశానికి వెళ్ళే చెప్పవచ్చు కదా ? ఒకవేళ నీతిఅయోగ్ సమావేశంలో చెప్పే అవకాశం రాకపోతే అక్కడి మీడియాతోనే ఇదంతా చెప్పవచ్చుకదా. ఏదేమైనా మోడీకి వ్యతిరేకంగా కేసీయార్లో మునుపుటి మెరుపులు లేవు, పంచ్ లూ లేవు. ఎందుకింతగా చప్పగా మారిపోయారో కేసీయార్ సాబే సమాధానం చెప్పాలి. అక్కడేమో దీదీ కూడా మోడీకి వ్యతిరేకంగా కాడి దింపేసినట్లే ఉంది. ఇక్కడేమో కేసీయార్ సాబ్ కూడా చప్పపబడిపోయారు. ఇంక మోడీకి భయమేముంది..ఫుల్లు హ్యపీస్.

మరింత సమాచారం తెలుసుకోండి: