వచ్చే ఎన్నికల్లో పోటీచేసి ఎలాగైనా గెలవాలని మహా పట్టుదలగా ఉన్న నారా లోకేష్ ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. పార్టీలో సీనియర్ నేత, బీసీల్లో గట్టిపట్టున్న గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేసేశారు. చిరంజీవి బీసీల్లోని చేనేతవర్గానికి చెందిన నేత. 2014 టీడీపీ తరపున పోటీచేసి కేవలం 13 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. గెలిచిన వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి 88,977 ఓట్లు వస్తే, ఓడిన గంజికి 88,965 ఓట్లొచ్చాయి.





ఓడిపోయినా తెచ్చుకున్న ఓట్లను బట్టి గంజికి నియోజకవర్గంలో ఎంతపట్టుందో అర్ధమవుతోంది. కాబట్టి 2019లో కూడా తానే పోటీచేస్తానని గంజి అనుకున్నారు. చంద్రబాబునాయుడు కూడా ఎన్నికల ముందువరకు అలాంటి కలరింగే ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హఠాత్తుగా కొడుకు లోకేష్ ను రంగంలోకి దింపారు. దాంతో గంజికి పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. అయితే చివరినిముషంలో ఏమీచేయలేక లోకేష్ కోసం పనిచేశారు. అయినా ఆళ్ళ ముందు లోకేష్ నిలబడలేక ఓడిపోయిన విషయం తెలిసిందే.





2024 ఎన్నికల్లో మళ్ళీ తనకే టికెట్ అని 2019 ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు చెప్పారట. అయితే ఈమధ్య లోకేష్ మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీచేస్తానని, గెలుస్తానని బహిరంగంగా ప్రకటించారు. అప్పటినుండి లోకేష్-గంజి మధ్య గ్యాప్ మొదలైంది. చివరకు పార్టీలో తనకు వెన్నుపోట్లు పొడిచినట్లు గంజి మీడియాతో మాట్లాడుతు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.





బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యతిచ్చే పార్టీలో చేరబోతున్నట్లు గంజి చెప్పారు. అంటే చెప్పకనే వైసీపీలో చేరబోతున్నట్లు చెప్పారన్నమాట. ఈ పరిణామం లోకేష్ కు పెద్ద షాకనే చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గంలో చేనేతల ఓట్లు చాలా ఎక్కువ. మొదటినుండి ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ కే ఎక్కువగా పోలయ్యేవి. రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓట్లన్నీ వైసీపీ వైపు మళ్ళాయి. అందుకనే రెండుసార్లు ఆళ్ళ గెలవగలిగారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళ, ఎంఎల్సీ మురుగుడు హనుమంతరావు లేదా గంజిలో ఎవరు పోటీచేసినా అంటే  పోటీలో ఉన్న ఒక్కళ్ళకు మిగిలిన ఇద్దరు మనస్పూర్తిగా పనిచేస్తే లోకేష్ గెలుపు కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: