క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలవటం చంద్రబాబునాయుడు, నారా లోకేష్ కు కష్టమేనా అనే డౌటు పెరిగిపోతోంది. ఇంతకాలం కుప్పంలో చంద్రబాబు గెలవకూడదని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. చెప్పటమే కాకుండా అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాపకింద నీరులాగ మంగళగిరిలో కూడా లోకేష్ ను ఓడించేందుకు అన్నీ వ్యూహాలు పన్నుతున్నట్లు తాజాగా బయటపడింది.





వచ్చే ఎన్నికల్లో తాను గెలిచి మంగళగిరిని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని లోకేష్ శపథం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ శపథం నెరవేరటం అనుమానంగా మారింది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి బాగా పట్టున్న సీనియర్ నేత గంజి చిరంజీవి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. గంజి రాజీనామా చేస్తారని బహుశా చంద్రబాబు, లోకేష్ ఊహించుండరు. బీసీ నేతైన గంజిది  చేనేత సామాజికవర్గం. తన సామాజికవర్గంలో గంజికి మంచిపట్టుంది.





2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న గంజిని చివరినిముషంలో చంద్రబాబు పక్కనపెట్టారు. కొడుకు లోకేష్ ను పోటీలోకి దింపటంకోసమే గంజిని దూరంగా ఉంచారు. మొన్నటి ఎన్నికల్లో లోకేష్ కు వచ్చిన ఓట్లలో అత్యధికం గంజి వల్లే అన్నది వాస్తవం.  అయితే ఈమధ్య గంజిని బాగా ఇబ్బందిపెట్టే పరిణామాలు పార్టీలో జరిగాయట. దాంతో పార్టీలో భవిష్యత్తులేదన్న నిర్ణయానికి వచ్చిన గంజి టీడీపీకి రాజీనామాచేశారు. మీడియాతో ఆయన మాటలు విన్నతర్వాత తొందరలోనే వైసీపీలో చేరుతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే జరిగితే లోకేష్ గెలుపు దాదాపు కష్టమనే చెప్పాలి.





ఎందుకంటే వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా నియోజకవర్గంలో గట్టిపట్టుంది. అలాగే ఎంఎల్సీ మురుగుడు హనుమంతరావుదీ చేనేతవర్గమే. ఈయనకు కూడా బాగాపట్టుంది. వీళ్ళద్దరికి అదనంగా గంజి కూడా వైసీపీలో చేరితే లోకేష్ వేరే నియోజకవర్గం చూసుకుంటేనే మంచిది. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన ఇద్దరు పనిచేస్తే ప్రత్యర్ధులు ఎవరైనా గెలవటం కష్టమే. అంటే బహిరంగంగా చంద్రబాబు ఓటమిపై దృష్టిపెట్టిన జగన్ లోకేష్ విషయంలో కూడా చాపకింద నీరులాగ పనిచేస్తున్నారనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: