ఇపుడిదే అందరిలో అనుమానాలు పెంచేస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో చంద్రబాబునాయు ఎలా వ్యవహరించారో ఇపుడు అదేపద్దతిలో తెలంగాణాలో కేసీయార్ కూడా వ్యవహరిస్తున్నారు.  ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ వివిధ కారణాలతో నరేంద్రమోడీతో విభేదించింది. ప్రధానమంత్రితో విభేదించిన టీడీపీ కేంద్రమంత్రివర్గంలోను, ఎన్డీయేలోను ఎలాగుంటుంది ? అందుకనే 2018లో కేంద్రమంత్రివర్గంతో పాటు ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసింది.





ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన దగ్గరనుండి నరేంద్రమోడీని టార్గెట్ చేయటమే టక్ష్యంగా చంద్రబాబు రాజకీయం నెరిపారు.  ఏపీలోకి సీబీఐ ఎంట్రీని నిషేధించారు. పదేపదే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మరీ మోడీని వ్యతిరేకించారు. అప్పట్లో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు పశ్చిమబెంగాల్, బెంగుళూరు, ఢిల్లీలో టూర్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసి తాను తప్పుచేశానని చంద్రబాబు బహిరంగంగా లెంపలేసుకున్నారు.





సీన్ కట్ చేస్తే ఇపుడు కేసీయార్ కూడా చంద్రబాబు లాగే వ్యవహరిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. కేసీయార్ ఎన్డీయేలో ఎప్పుడూ చేరకపోయినా గతంలో అవసరార్ధం కొన్ని బిల్లులకు మద్దతిచ్చారు. ప్రభుత్వానికి అవసరమైన వెసులుబాట్లు కేంద్రం ఇవ్వకపోయేసరికి మోడీకి కేసీయార్ బద్ద వ్యతిరేకిగా మారిపోయారు. సీబీఐని దేశమంతా వ్యతిరేకించాలని పిలుపిచ్చారు. అంటే తొందరలోనే తెలంగాణాలోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు బెంగాల్, కర్నాటకలో ప్రచారం చేసినట్లే కేసీయార్ కూడా యూపీ ఎన్నికలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబు బాటలోనే కేసీయార్ కూడా ప్రయాణించక తప్పదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకపోతే కేసీయార్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏపీలో టీడీపీ-వైసీపీ డైరెక్ట్ ఫైట్ జరిగింది. తెలంగాణాలో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య ముక్కోణపు ఫైట్ జరుగుతుందని అనుకుంటున్నారు. కాంగ్రెస్-బీజేపీ బలపడేకొద్దీ ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోయి టీఆర్ఎస్ లాభపడే అవకాశం కూడా ఉంది. ఈ కాంబినేషన్ ఒక్కటే కేసీయార్ ను రక్షిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: