అనకాపల్లిపై రైల్వే శాఖ అధికారులు శీతకన్ను వేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లల్లో కనీసం సగం రైళ్లకు కూడా ఇక్కడ హాల్ట్‌ ఇవ్వలేదు. ప్రధానంగా ఈశాన్య, తూర్పు రాష్ట్రాల నుంచి దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే దూరప్రాంత రైళ్లల్లో ఒక్కటి కూడా ఇక్కడ ఆగదు. దీంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు విశాఖ వెళ్లి రైళ్లు ఎక్కాల్సి వస్తున్నది. ప్రస్తుతం ఇక్కడి నుంచి నిత్యం ఐదువేల మంది వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సగటున రూ.6 లక్షల ఆదాయం వస్తున్నది. అనకాపల్లి స్టేషన్‌ మీదుగా రోజూ 80 వరకు ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో సగం రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వైపు వెళ్లే గోదావరి, విశాఖ, ఈస్టుకోస్టు, కోణార్క్‌, గరీబ్‌రథ్‌, జన్మభూమి, షిరిడీ రైళ్లు, విజయవాడ మీదుగా తిరుపతి/ చెన్నై/ బెంగళూరు వైపు వెళ్లే తిరుమల, మెయిల్‌, ఉదయ్‌, ప్రశాంతి, అలెప్పీ, పూరి/బిలాస్‌పూర్‌-తిరుపతి రైళ్లు, గుంటూరుకు సింహాద్రి, రాయగడ రైళ్లతోపాటు మరికొన్ని వీక్లీ/ బైవీక్లీ రైళ్లు వున్నాయి. వీటిల్లో జనరల్‌ బోగీలు అరకొరగా వుండడం, అనకాపల్లి వచ్చే సరికి అడుగు పెట్టడానికి కూడా వీలుకాని పరిస్థితి వుండడంతో ఇక్కడి నుంచి ప్రయాణించే వారు తప్పనిసరిగా ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకోవాల్సిందే. దువ్వాడ స్టేషన్‌కు రైల్వే అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అనకాపల్లి జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


విశాఖ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ స్టేషన్‌లో 75 శాతం రైళ్లకు హాల్ట్‌ వుందని, అనకాపల్లిలో మాత్రం సగం రైళ్లకు కూడా హాల్ట్‌ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాలిమార్‌-వాస్కోడిగామా, విశాఖ- మహబూబ్‌నగర్‌, భువనేశ్వర్‌-పాండిచ్చేరి/ పుణె/ బెంగళూరు, కతియార్‌- తిరువనంతపురం, డిబ్రూఘర్‌- బెంగళూరు, భాగల్‌పూర్‌-బెంగళూరు, విశాఖ- గాంధీధామ్‌, తదితర రైళ్లకు దువ్వాడలో హాల్ట్‌ వుందని, అనకాపల్లిలో హాల్ట్‌ లేదని గుర్తు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు అనకాపల్లి మీదుగా పలు రైళ్లు నడుస్తున్నాయి. కొన్ని రైళ్లు తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా వెళుతున్నాయి. వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ ఆగదు. అనకాపల్లి జిల్లా నుంచి ఖరగ్‌పూర్‌, కోల్‌కతా వంటి ప్రాంతాలకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. మెయిల్‌, ఈస్టుకోస్టు మినహా మరో రైలు ఇక్కడ ఆగదు. రోజూ నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అనకాపల్లిలో హాల్ట్‌ సదుపాయం కల్పించాలని ఎంతోకాలంగా ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడలేదు. ఇంకా కోరమండల్‌, హైదరాబాద్‌ వెళ్లే దురంతో, ముంబై వెళ్లే ఎల్‌టీటీ (దీనికి పిఠాపురం వంటి చిన్న స్టేషన్‌లో హాల్ట్‌ వుంది), సంబర్‌పూర్‌- నాందేడ్‌, విశాఖపట్నం-కొల్లాం, హౌరా- బెంగళూరు, పూరి-ఓఖా.. ఇలా పలు రైళ్లకు అనకాపల్లిలో హాల్ట్‌ ఇవ్వాల్సిన అవసరం వుంది. అనకాపల్లిలో హాల్ట్‌ లేని విశాఖ- కొల్లాం- విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఎలమంచిలిలో హాల్ట్‌ ఇవ్వడం విచిత్రం. విశాఖ నుంచి షిర్డికి కేవలం గురువారం మాత్రమే రైలు అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: