అసెంబ్లీ సమావేశాల చివరిరోజు ఎన్టీయార్ పేరుచెప్పి అధికారపక్షం చంద్రబాబునాయుడును చెడుగుడు ఆడేసుకున్నది. హెల్త్ యూనివర్సిటికి ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చే బిల్లును అధికారపార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సహజంగానే దీనికి టీడీపీ సభ్యుల నుండి వ్యతిరేకత, అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు మాట్లాడుతు ఎన్టీయార్ ను చంద్రబాబునాయుడు ఏ విధంగా అవమానించరో ఉదాహరణలతో సహా వివరించారు.





ఎన్టీయార్ ను ముఖ్యమంత్రి పదవిలో నుండి దింపేయటం, పార్టీని ఎన్టీయార్ నుండి లాగేసుకోవటం, పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించటం దగ్గర నుండి ఎన్టీయార్ ను దింపేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతు చంద్రబాబు ఎంతగా అవమానించిందో అప్పటి పేపర్ కట్టింగులను ప్రదర్శించారు. అప్పట్లో ఎన్టీయార్ ను చంద్రబాబు ఎంతగా అవమానించారో కూడా సభలో అధికారపక్షం పేపర్ కట్టింగులను చూపించింది. తెలుగుదేశంపార్టీకి, రాష్ట్రానికి ఎన్టీయార్ అవసరం లేదని అప్పట్లో చంద్రబాబు చెప్పిన ఇంటర్వ్యూ కట్టింగులను కూడా చూపారు.





వైశ్రాయ్ హోటల్ కు వచ్చిన ఎన్టీయార్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన విషయాన్ని కూడా సభ్యులు గుర్తుచేశారు. ఈరోజు ఎన్టీయార్ పై ప్రేముందని చెప్పుకుంటున్న సభ్యుల్లో చాలామంది ఆరోజు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటులో ఎందుకు భాగస్తులయ్యారో చెప్పాలంటు నిలదీశారు. మొత్తంమీద ఎన్టీయార్ పేరును అడ్డుపెట్టుకుని మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు చంద్రబాబును ఫుల్లుగా వాయించేశారు.






అధికారపార్టీ వరస చూస్తుంటే చంద్రబాబును మాటలతో కుళ్ళబొడవటం కోసమే ఎన్టీయార్ పేరును అడ్డం పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది. అయితే ఇక్కడ వైసీపీ మరచిపోయిందేమంటే డాక్టర్ వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టాలని అనుకుంటే ఇప్పటికే ఉన్న ఎన్టీయార్ పేరును తీసేయాల్సిన అవసరంలేదు. వైద్య శాఖలోనే ఏదో ఒక కొత్త వ్యవస్ధను తీసుకొచ్చి దానికి వైఎస్సార్ పేరు పెట్టుంటే బాగుండేది. ఒకవైపు విజయవాడ పేరుతో ఏర్పాటుచేసిన జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టి మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసేయటం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: