వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన అధినేత, పవర్ స్టార్ కోరిక తీరాలని పార్టీ జనాలు, అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కూడా పవన్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయాలని అనుకుంటున్నారట. పోయిన ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయింది సరిపోలేదేమో. ఎలాగైనా రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి గెలిచి తన సత్తా ఏమిటో జగన్మోహన్ రెడ్డికి  చూపించాలని కంకణం కట్టుకున్నట్లున్నారు.





పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే తాజాగా వైజాగ్ ఉత్తరం నియోజకవర్గంపై పవన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారట. ఇక్కడే ఎందుకంటే ఈ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ నియోజకవర్గం. అలాగే పవన్ ఫ్యాన్స్+కాపుల జనాభా బాగా ఎక్కువగా ఉందట. అందుకనే తమ దగ్గర పోటీచేస్తే గెలుపు గ్యారెంటీ అని ఉత్తరం నియోజకవర్గం నేతలు పవన్ కు పదే పదే చెబుతున్నారట. దాంతో పవర్ స్టార్ లో కూడా ఉత్తరం నుండి పోటీచేస్తే ఎలాగుంటుందనే ఆలోచన మొదలైందని అంటున్నారు.





ఇప్పటికే పవన్ పోటీచేయబోయే నియోజకవర్గాలని చాలా పేర్లే ప్రచారంలో ఉన్నాయి. తిరుపతి, భీమిలీ, కాకినాడ, పిఠాపురం, నరసాపురం అనే పెద్ద జాబితానే వినిపిస్తోంది. ఈ జాబితాలో తాజాగా విశాఖ ఉత్తరం కూడా చేరింది. అయితే వైజాగ్ ఉత్తరం నియోజకవర్గంతో పాటు రెండో నియోజకవర్గంలో కూడా పోటీచేయబోతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో రెండు నియోజకవర్గాల్లో పవన్ పోటీచేయటం ఖాయమనే ప్రచారం మొదలైంది. నిజానికి రెండు నియోజకవర్గాల్లో పోటీచేయటమంటే చాలా కష్టమనే చెప్పాలి.






ఎంతో పక్కాగా పార్టీ యంత్రాంగం ఉన్న నేతలు, జనాల్లో బాగా పట్టున్న నేతలు, ఎంతోమంది నమ్మకస్తులున్న నేతలు కూడా రెండుచోట్ల పోటీచేయటానికి వెనకాడుతారు. ఎందుకంటే రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను చూసుకోవటం, భారీ ఎత్తున చేయాల్సిన ఖర్చు, రెండుగా డివైడ్ అయిపోయే యంత్రాంగం లాంటి సమస్యల కారణంగా రెండు నియోజకవర్గాల్లో పోటీచేయరు. కానీ పవన్ ఇవన్నీ ఆలోచిస్తున్నట్లు లేరు. కేవలం తన అభిమనగణాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెండుచోట్లూ బోల్తాకొట్టారు. మరి వచ్చే ఎన్నికల్లో కూడా రెండుచోట్లా పోటీచేయటం ఖాయమైతే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: