కలలో కూడా తలచుకోవటానికి చంద్రబాబునాయుడు ఇష్టపడని అంశాన్ని అత్యంత విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడు బయటపెట్టేశారు. దాంతో చంద్రబాబు వ్యవహారం అడకత్తెరలో పోకచెక్కలాగ తయారైంది. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబుతో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఫెవికాల్ కన్నా గట్టిదన్న విషయం ‘ఓటుకునోటు’ కేసు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. తాజాగా యాదాద్రి జిల్లాలో ఒక సమావేశంలో రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ లోకి తనను చంద్రబాబే పంపించారని ప్రకటించారు.






కాంగ్రెస్ తోనే చంద్రబాబు రాజకీయం మొదలైందని ఎంఎల్ఏగా గెలిచి మంత్రి అయ్యింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే అని రేవంత్ గుర్తుచేశారు. నిజానికి తన రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీతోనే అని గుర్తుచేసుకోవటానికి కూడా చంద్రబాబు ఇష్టపడరు. ఎన్టీయార్ టీడీపీ స్ధాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తుచేసుకోవటానికి ఇష్టపడరు. చిత్తుగా ఓడిన తర్వాతే చంద్రబాబు టీడీపీలో చేరారు.






అదే విషయాన్ని రేవంత్ ఇపుడు గుర్తుచేశారు. అలాగే కాంగ్రెస్ లో నుండి చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళినట్లే తనను టీడీపీలో నుండి కాంగ్రెస్ లోకి పంపారన్న నిజాన్ని రేవంత్ బహిరంగంగా అంగీకరించారు. పైగా చంద్రబాబు తనను కాంగ్రెస్ పార్టీలోకి పంపటంలో తప్పేముంది ? అని జనాలనే ఎదురు ప్రశ్నించారు. పార్టీలు మారటం రాజకీయాల్లో చాలా మామూలే కాబట్టి రేవంత్ టీడీపీలో నుండి కాంగ్రెస్ లోకి రావటంలో తప్పేలేదు.






అయితే చంద్రబాబే తన ఏజెంటుగా రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపారని స్వయంగా కాంగ్రెస్ లోని సీనియర్లలో చాలామంది ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. రేవంత్ కు పీసీసీ అధ్యక్షపదవిని కూడా చంద్రబాబే ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంతకాలం ఆ ఆరోపణలపై రేవంత్ ఏమీ స్పందించలేదు. అలాంటిది ఇపుడు చెప్పిన మాటలతో చంద్రబాబు వల్లే తనకు పీసీసీ వచ్చిందని రేవంత్ అంగీకరించినట్లయ్యింది. కాకపోతే కేసీయార్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల వల్లే జైల్లో చిప్పకూడు తిన్నానని రేవంత్ చెప్పింది మాత్రం అబద్ధమే. ఓటుకునోటు కేసులో పట్టుబడి రేవంత్ జైలుకెళ్ళిన విషయం అందరికీ తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: