మొత్తంమీద గుడివాడ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున చంద్రబాబునాయుడు ఏరికోరి మాంచి అభ్యర్ధిని రంగంలోకి దింపబోతున్నారట. ఇంతకీ ఆ మాంచి అభ్యర్ధి ఎవరయ్యా అంటే మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావట. బహుశా కొడాలికి వ్యతిరేకంగా పోటీచేయటానికి టీడీపీలో ఇంకెవరు ముందుకొచ్చినట్లు లేదు. పైగా అందరు కలిసి దేవినేనికి మించిన అభ్యర్ధి హోలు టీడీపీలోనే లేరని ఒకటికి పదిసార్లు చంద్రబాబుకు  చెప్పారట.






ఇంకేముంది కొడాలిని ఢీ కొట్టే అన్నీరకాల సత్తా ఉన్న నేత దేవినేని మాత్రమే అని చంద్రబాబు కూడా ఫిక్సయిపోయినట్లున్నారు. అందుకనే జిల్లా ప్రత్యేకంగా గుడివాడ నేతల సమీక్షలో ఈ విషయం ఫైనల్ అయిపోయిందనే టాక్ మొదలైంది. నిజానికి దేవినేనికి గుడివాడకు ఎలాంటి సంబంధంలేదు. పోయిన ఎన్నికల్లో దేవినేని పోటీచేసి ఓడిపోయింది మైలవరం నియోజకవర్గంలో. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందే అని ఈ మాజీ మంత్రి పట్టుదలగా ఉన్నారు.





ఇంతలోనే గుడివాడ నియోజకవర్గంలో పోటీ అనేది ఊహించని ట్విస్టు. గుడివాడ టీడీపీలో వైసీపీ అభ్యర్ధి కొడాలినానీని ఢీ కొనేంత సీన్ ఉన్న నేతలు లేరన్నది వాస్తవం. పైగా ప్రతి ఎన్నికకు చంద్రబాబు ఒక కొత్త అభ్యర్ధిని పోటీకి దింపుతుండటం వల్ల పార్టీ బాగా వీకైపోయింది. పార్టీలకు అతీతంగా కొడాలికి జనాల్లో మంచి ఫాలోయింగుంది. ఈ కారణంగానే టీడీపీ కూడా ఏదో పోటీ చేస్తున్నామంటే పోటీ చేస్తున్నామన్నట్లుగానే ఉంటోంది. ఈ కారణంగానే గడచిన రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ అభ్యర్ధిగా కొడాలి గెలుస్తున్నారు.





ఇపుడు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున గట్టి అభ్యర్ధి కోసం చాలా వెతుకులాటే జరిగింది. కొత్త, పాత నేలందరినీ చంద్రబాబు కదలించి చూశారు. అయితే ఎవరు కూడా గట్టిపోటీ ఇవ్వలేరన్నది అర్ధమైపోయింది. అందుకనే నేతలందరు కలిసి దేవినేని మెడకు గంటకట్టారు. రేపటి ఎన్నికల్లో గనుక దేవినేని గుడివాడలో పోటీచేస్తే పోటీ భలే రంజుగా ఉంటుంది. ఎందుకంటే అసలు కొడాలి-దేవినేని అంటే ఉప్పు నిప్పు. ఇద్దరి మధ్య మాటల తూటాలు బ్రహ్మాండంగా పేలుతునే ఉంటాయి. దీనికి తోడు ఇక ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్ధులైతే ఇక చెప్పేదేముంటుంది చూడటమే.

మరింత సమాచారం తెలుసుకోండి: