మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో ఒక విషయం చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా ముందుగా చూసేది సోషల్ ఇంజనీరింగే. సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజికవర్గాల లెక్కలు. ఏ సామాజికవర్గం ఓట్లు ఎన్నున్నాయోనే విషయాన్ని లెక్కలు వేసుకుని మొదటి రెండు లేదా మూడు సామాజికవర్గాలకు చెందిన నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళకే పార్టీలు టికెట్లిస్తున్నాయి. మైనారిటికి చెందిన సామాజికవర్గం నుండి అభ్యర్ధిని ఎంపిక చేయటం చాలా అరుదు అయిపోయింది.





అలాంటిది ఇపుడు మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ను పట్టించుకోలేదు. పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే అని అందరికీ తెలిసిందే. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి అభ్యర్ధులను రంగంలోకి దింపాయి. టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డే పోటీచేసే అవకాశం ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలో మెజారిటి ఓటర్లుగా ఉన్న బీసీలను అన్నీపార్టీలు నిర్లక్ష్యంచేయటంతో బీసీలు ఇపుడు మండిపోతున్నారు.





ఇక్కడ మూడుపార్టీలు కూడా రెడ్డి అభ్యర్ధులనే రంగంలోకి దింపాయి. ఇందుకనే అన్నీపార్టీలు తమను నిర్లక్ష్యం చేశాయని బీసీల్లో ఫీలింగ్ పెరిగిపోతోంది. ఈ నియోజకవర్గంలో మెజారిటి ఓటర్లు బీసీలు. బీసీఓట్లు సుమారు 60 శాతం ఉంటుందని అంచనా. బీసీల్లో కూడా గౌడ్లు 16 శాతం, ముదిరాజ్ 15, యాదవులు సుమారు 10, పద్మశాలీలు 5, వడ్డెర, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణులు 10 శాతం ఉంటారు. ఇక రెడ్ల శాతం 3.49 శాతం మాత్రమే.






అంటే 3.49 శాతం ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలే దశాబ్దాలుగా సుమారు 60 శాతం ఓట్లున్న బీసీలు, అదర్స్ ను ఏలుతున్నారు. 2018 ఎన్నికల్లో సామాజికవర్గాల గొడవ పెద్దగా లేదుకానీ ఇపుడు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అదికూడా టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లాంటి వాళ్ళనుండే ఉంది. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కేసీయార్ బీసీ అభ్యర్ధిని మాత్రమే పోటీలోకి దించాలని నర్సయ్య గౌడ్ తో పాటు బీసీ సంఘాలు కూడా పెద్దఎత్తున డిమాండ్ చేశాయి. అయితే కేసీయార్ కాదు అసలు ఏ పార్టీ కూడా బీసీ డిమాండును పట్టించుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: