అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మొదలైన పాదయాత్రకు మొదటిసారిగా భారీఎత్తున నిరసన ఎదురైంది. యాత్ర మొదలైన 34వ రోజున పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించింది. మంగళవారం కూడా నిరసనలు ఎదురైనా అవి చిన్నవనే చెప్పాలి. అయితే బుధవారం మాత్రం మూడురాజధానులకు మద్దతుగా భారీ ప్రదర్శన, సభ జరగటంతో వాతావరణ ఉద్రిక్తంగా మారింది.





అయితే పోలీసులు సర్దిచెప్పటంతో పరిస్దితి సద్దుమణిగింది. పట్టణంలోని నరేంద్ర సర్కిల్ దగ్గరకు పాదయాత్ర వచ్చేసరికి మూడు రాజధానులకు మద్దతుగా భారీఎత్తున జనాలు నల్లబెలూన్లతో ఎదురొచ్చారు. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు  మద్దతుగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న అమరావతి మద్దతుదారులు గట్టిగా నినాదాలు చేయటంతో గోల మొదలైంది.





సెంటర్లో రోడ్డుకి చెరోవైపు అమరావతి మద్దతుదారులు, మూడురాజధానుల మద్దతుదారులు చేరుకోవటంతో ఎప్పుడేమి జరుగుతుందో అన్న టెన్షన్ పెరిగిపోయింది. అయితే ఇద్దరికీ మధ్యలో పోలీసులు గట్టిగా నిలబడటంతో సమస్య పెద్దది కాలేదు. కాకపోతే చెరోవైపు నిలబడిన జనాలు చాలాసేపు తమ డిమాండ్లతో నినాదాలిస్తునే ఉన్నారు. పాదయాత్ర మొదలైన ఇన్నిరోజులకు అమరావతి జేఏసీకి మొదటిసారిగా ఇంతబలంగా వ్యతిరేకత ఎదురైంది.





ఇన్నిరోజులు గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పాదయాత్ర జరిగింది. అయితే మొన్నటివరకు పాదయాత్రకు వ్యతిరేకంగా ఎవరూ పెద్దగా నిరసన తెలియజేయలేదు. అందుకనే పాదయాత్ర ప్రశాంతంగా జరిగిపోయింది. ఎప్పుడైతే తణుకులోకి ప్రవేశించిందో నిరసనలు మొదలయ్యాయి. తణుకు నియోజకవర్గమంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావుది. మొదటినుండి మూడురాజధానులకు మద్దతుగా మంత్రి చాలాబలంగా తనవాయిస్ వినిపిస్తున్నారు. ఈ కారణంగానే తణుకులో పాదయాత్రకు గట్టి నిరసన ఎదురైంది.


బహుశా ఇక ముందంతా పాదయాత్రకు ఇలాంటి నిరసనలు ఎదురవుతునే ఉంటాయేమో. ఎందుకంటే గోదావరి జిల్లాలో నుండే పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ఎంటరవ్వాలి. ఇప్పటికే విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.  15వ తేదీన ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగసభ జరగబోతోంది. ఈ నేపధ్యంలోనే అమరావతికి మద్దతుగా పాదయాత్ర ఎంటరైతే ఏమవుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: