ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డిమాండ్ పెరిగిపోతున్నట్లే ఉంది. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతు పవన్ తమకు మిత్రపక్షనేతగానే చెప్పుకున్నారు. తమను వదిలిపెట్టి పవన్ ఎక్కడికి వెళ్ళరనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ చేతులు కలపటాన్ని తమ్ముళ్ళు బహిరంగంగానే స్వాగతిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చంద్రబాబు, పవన్ చేతులు కలపటం చాలామంచి పరిణామంగా తమ్ముళ్ళు అభివర్ణిస్తున్నారు.





అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని అనుకుంటున్న నేతలేమో రెండుపార్టీల అధినేతలు కలిసిపనిచేయటాన్ని స్వాగతిస్తున్నారు. టికెట్ మీద నమ్మకంలేని వాళ్ళు, అయోమయంలో ఉన్నవాళ్ళు జరుగుతున్నదాన్ని మౌనంగా చూస్తున్నారు. సరే తమ్ముళ్ళ సంగతి ఇలాగుంటే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతు చంద్రబాబు, పవన్ చేతులు కలపటం శుభపరిణామంగా చెప్పారు. తమపార్టీ కూడా వాళ్ళతో చేతులు కలుపుతుందన్నారు.





అంటే తమతో పవన్ చేతులు కలపాలని చంద్రబాబు, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా అని సీపీఐ నారాయణ ఎదురు చూస్తున్నట్లే ఉంది. వీళ్ళ విషయాన్ని వదిలేస్తే బీజేపీని వదిలేయటానికి పవన్ మానసికంగా రెడీ అయినట్లు తెలిసిపోతోంది. లేకపోతే తన మిత్రపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పవన్ చేతులు కలపే అవకాశమే లేదు. బీజేపీ మీద తనలో పేరుకుపోయిన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తంచేసిన కొద్దిసేపటికే చంద్రబాబు, పవన్ భేటీ జరగటమంటే మామూలు విషయంకాదు. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని అర్ధమవుతోంది.





పవన్ ఆలోచనలు ఇంత స్పష్టంగా అర్ధమవుతున్నా కూడా దియోధర్ మాట్లాడుతు పవన్ తమను వదిలపెట్టి వెళ్ళడని అంటున్నారంటే అర్ధమేంటి ? వచ్చే ఎన్నికల్లో తమరెండు పార్టీలే కలిసి పోటీచేస్తాయని కూడా బీజేపీ ఇన్చార్జి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే పవన్ను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ తో కలిసి నడిచేందుకు చంద్రబాబు కూడా యాక్షన్ ప్లాన్ రెడీచేస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసే ఉండాలని సీపీఐ బలంగా కోరుకుంటోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా పవన్ కు డిమాండ్ పెరిగిపోయిందనే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: