బుధవారం రాత్రి మోయినాబాద్ ప్రాంతంలోని ఫాంహౌస్ లో బయటపడిన టీఆర్ఎస్ ఎంఎల్ఏల బేరసారాల ఘటనపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే నలుగురు టీఆర్ఎస్ ఎంఎల్ఏలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసిందా ? ఒక్కొక్కళ్ళకు రు. 100 కోట్లు ఆఫర్ చేసిందా ? అవుననే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే వాటిని ఖండిస్తున్నారు బీజేపీ నేతలు. అంటే ఘటనకు రెండువైపులా వాదనలు వినిపిస్తున్నారు. దాంతో ప్రజల్లో అయోమయం పెరిగిపోతోంది.





నిజానికి ఎంఎల్ఏలను కొనుగోలు చేయటం, ప్రలోభాలకు గురిచేయటం చాలా మామూలైపోయింది. అధికారంలో ఎవరుంటే వాళ్ళు ప్రతిపక్షాల ఎంఎల్ఏలకు వల విసరుతున్నారు. ఇందులో బీజేపీ, టీఆర్ఎస్ దేనికదే సాటి. ఇపుడు బయటపడిన ఘటననే తీసుకుంటే టీఆర్ఎస్ ఎంఎల్ఏలను నిజంగానే ప్రలోభాలకు గురిచేయాలని బీజేపీ అనుకంటే ఆపని హైదరాబాద్ లోనే ఎందుకు చేస్తుంది ? తమ పాలిత రాష్ట్రాలకు పిలిపించుకుంటుంది కదా అనే ప్రశ్న పెరిగిపోతోంది. ఇక ఫాం హౌస్ లో పోలీసులు దాడిచేసినపుడు టీఆర్ఎస్ ఎంఎల్ఏలు తప్ప  బీజేపీ నేతలు ఎవరూ లేరు.





ఇదే సమయంలో ఫాం హౌస్ లో డబ్బులు ఇచ్చిపుచ్చుకవటం ఏమీ జరగలేదు. దీంతోనే అసలు బేరాలు జరిగింది కరెక్టేనా అనే సందేహం పెరిగిపోతోంది. పైగా ఒక ఎంఎల్ఏ గువ్వల బాలరాజు మాట్లాడుతు ఘటనకు తమకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఫ్రెండ్ ను కలవటానికే ఫాం హౌస్ కు వచ్చినట్లు చెప్పారు. రు. 15 కోట్లు సీజ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారంతే మీడియాకు చూపలేదు.





తమ ఎంఎల్ఏలను కొనేందుకు బీజేపీ అనైతికంగా బేరసారాలకు దిగిందని కొందరు టీఆర్ఎస్ ఎంఎల్ఏలు  ఆరోపిస్తున్నారే కానీ అందుకు ఆధారాలు చూపించటంలేదు. ఇదే సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సింహయాజులు, నందకుమార్ మరో వ్యక్తి తాము పూజకోసమే వచ్చామంటున్నారు. ఇందులో కూడా నందకుమార్ అనే వ్యక్తి టీఆర్ఎస్ ముఖ్యులకు బాగా సన్నిహితుడంటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొన్ని ఫొటోలుచూపిస్తు ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో వ్యవహారమంతా గందరగోళంగా తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: