కొందరంతే ఎవరికీ ఎప్పటికీ అర్ధంకారు. వాళ్ళంతట వాళ్ళుగా తమ ఆలోచనలేంటో తమ వ్యూహాలేమిటో బయటపెడితే కానీ అందరు అర్ధంచేసుకోలేరు. అలాంటి వ్యూహాలుపన్నటంలో కేసీయార్ దిట్టని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికి రెండుసార్లు టీఆర్ఎస్ ఎంఎల్ఏలకు రెండుపార్టీలు వలేసి రెండూ ఘోరంగా దెబ్బతిన్నాయి. మొదటిసారి వలేసింది తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. చేపను పడదామని చంద్రబాబు ఎరేస్తే ఆ ఎరతో పాటు ఎరేసిన  వాళ్ళని కూడా కేసీయార్ మింగేశారు.





2014లో కేసీయార్ ముఖ్యమంత్రవ్వగానే ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి. నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటును వేయించుకుని కేసీయార్ ను దెబ్బకొడదామని చంద్రబాబునాయుడు ప్లాన్ చేశారు. ఆ విషయాన్ని పసిగట్టి ట్రాప్ కు రివర్స్ ట్రాప్ వేసి చంద్రబాబు తరపున డబ్బులు ఇవ్వటానికి వచ్చిన అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డినే పట్టించిన ఘనుడు కేసీయార్. ఆ ఘటనే దేశవ్యాప్తంగా ‘ఓటుకునోటు’ కేసుగా సంచలనమైంది.





ఎప్పుడైతే తాను వేసిన ట్రాప్ ఫెయిలైందని అర్ధమైందో వెంటనే చంద్రబాబు హైదరాబాద్ నుండి విజయవాడకు జంపైపోయారు. మళ్ళీ అప్పటినుండి తెలంగాణా విషయాల్లో జోక్యం చేసుకుంటే ఒట్టు. దానిదెబ్బకు తెలంగాణాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. చాలా కాలం తర్వాత టీఆర్ఎస్  ఎంఎల్ఏల కొనుగోలుకు మళ్ళీ ఇపుడు ప్రయత్నాలు జరిగాయి. ఇపుడు కూడా నలుగురు ఎంఎల్ఏలను ట్రాప్ చేశారని తెలుసుకుని వెంటనే దానికి రివర్స్ ట్రాప్ వేసి ట్రాప్ వేసిన  బీజేపీనే కేసీయార్ ఇరికించారు.





దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసిన చరిత్ర ఎలాగూ బీజేపీకి ఉంది కాబట్టి ఇపుడు కమలంపార్టీ బాగా గబ్బుపట్టిపోయింది. టీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కుని కేసీయార్ ను ఏదో చేద్దామని ప్రయత్నించిన బీజేపీ తానే కేసీయార్ ట్రాపులో ఇరుక్కుపోయింది. ఇపుడీ కేసులో నుండి బయటపడేందుకు నానా అవస్తలు పడుతోంది. తనకన్నా ముందు టీఆర్ఎస్ ఎంఎల్ఏకి ఎరేసి చంద్రబాబు ఎలా దెబ్బతిన్నారో చూసికూడా బీజేపీ మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేసింది. అంటే అప్పుడు టీడీపీ అయినా ఇపుడు బీజేపీ అయినా కేసీయార్ ను చాలా తక్కువ అంచనా వేయబట్టే ఫలితం అనుభవిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: