హఠాత్తుగా తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిని చంద్రబాబునాయుడు మార్చేశారు. ఇంతకాలం అద్యక్షబాధ్యతలు మోస్తున్న బక్కని నర్సింహులు స్ధానంలో కాసాని జ్ఞానేశ్వర్ కు పగ్గాలు అప్పగించారు. ఎందుకని ఇంత హడావుడిగా అధ్యక్షుడిని మార్చాల్సొచ్చింది ? బక్కని సారద్యంలో జరగని అద్భుతాలు కాసాని నాయకత్వంలో జరుగుతుందా ?  అలాగని ఎవరికీ ఆశలు ఏమీలేవు. అయినా ఎందుకు మార్చారంటే కాసానికి ఉన్న ఆర్ధికబలమే కారణమని అర్ధమవుతోంది.





చాలాకాలం పార్టీకి ఎల్ రమణ అధ్యక్షుడిగా ఉండేవారు. పార్టీలో ఎంతకాలం పనిచేసినా ఎదుగుబొదుగు ఉండదని అర్ధమైపోయి పార్టీని వదిలేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. కారుపార్టీలో అలాచేరారో లేదో వెంటనే రమణ ఎంఎల్సీ అయిపోయారు. ఆయన స్ధానంలో బక్కని నర్సింహులను నియమించారు. నిజానికి బక్కని ఎవరో పార్టీలోని చాలామందికి పెద్దగా తెలియదనే చెప్పాలి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టేంత గొప్ప నేతయితే కాదు. కాకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేయాల్సిందే కాబట్టి బక్కనిని నియమించారంతే.





బక్కని ఏదోలా పార్టీని నెట్టుకొచ్చేస్తున్నారని అనుకుంటే సడెన్ గా కాసానిని అధ్యక్షుడిగా నియమించారు. రమణ, బక్కని, ఇపుడు కాసాని ముగ్గురు కూడా బీసీ నేతలే కావటం గమనార్హం. తెలంగాణాలో బీసీల జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు రాజకీయంగా కూడా అన్నీపార్టీల్లో నిలదొక్కుకున్నారు. మొదటినుండి బీసీల్లో అత్యధికులు టీడీపీనే అంటిపెట్టుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బీసీ నేతలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకనే చాలామంది టీఆర్ఎస్, కొందరు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు.





ఏ పార్టీలోను చేరలేని నేతలు మాత్రమే టీడీపీలో కంటిన్యు అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కాసాని పార్టీలో చేరారు. చేరిన 15 రోజులకే అధ్యక్షుడైపోయారు. మరి కాసాని వల్లయినా పార్టీ రాతమారుతుందా ? ఛాన్సేలేదనిపిస్తోంది. ఎందుకంటే పార్టీకి అసలు సమస్యే చంద్రబాబు. అలాంటిది ఎలాంటి అదికారాలు లేని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఎవరుంటే ఏమి ? కేసీయార్ దెబ్బకు చంద్రబాబు భయపడి విజయవాడకు పారిపోయిన తర్వాతే తెలంగాణాలో టీడీపీ శిధిలమైపోయింది. కాబట్టి పార్టీకి పూర్వవైభం ఇక సాధ్యంకాదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: