మొన్ననే వచ్చిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాన్ని  అందరు చూసుంటారు. త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇది స్ధూలంగా అందరు చూసిందే. ఈ ఫలితమే జగన్మోహన్ రెడ్డికి ఒక సందేశం కూడా వినిపించింది. అదేమిటంటే సంక్షేమపథకాలను మాత్రమే నమ్ముకుంటే గెలవటం కష్టమని. ఎలాగంటే మునుగోడులో 2.41 లక్షల ఓట్లలో సుమారు 2.21 లక్షల ఓట్లు పోలయ్యాయి.





మొత్తం జనాభాలో 2.3 లక్షల మందికి ఏదోరూపంలో ప్రభుత్వం నుండి సంక్షేమపథకాల రూపంలో లబ్ది అందుతోంది. దీనికి అదనంగా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఓటర్లందరికీ డబ్బులు విపరీతంగా పంచిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. సంక్షేమపథకాల రూపంలో, ఎన్నికల్లో జనాలకు ఇన్ని కోట్ల రూపాయలు పంచినా టీఆర్ఎస్ కు వచ్చింది 93 వేల ఓట్లుమాత్రమే. నియోజకవర్గంలోని 2.3 లక్షలమందికి పథకాల రూపంలో వేలాది కోట్ల రూపాయలు అందుతున్నా ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 93 వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే అర్ధమేంటి ?





ఏమిటంటే పథకాల రూపంలో లబ్దిపొందుతున్న వారందరు టీఆర్ఎస్ కు ఓట్లేయలేదని. పథకాల ద్వారా అందుకనే లబ్ది వేరు, ఎన్నికల్లో ఓట్లేయటం వేరన్న విషయంలో జనాలకు మంచి క్లారిటి ఉందన్న విషయం అర్ధమవుతోంది. పథకాల రూపంలో ఎన్నివేల కోట్ల రూపాయలు పంచినా, ఎన్నికల్లో డబ్బులు తీసుకుని కూడా టీఆర్ఎస్ కు ఓట్లేయలేదని అర్ధమైంది.





ఇదే విషయాన్ని జగన్ బాగా గుర్తుంచుకోవాలి. రు. 1.5 లక్షల కోట్లు సంక్షేమపథకాల రూపంలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాం లబ్దిదారులు మనకు ఎందుకు ఓట్లేయరన్నట్లుగా జగన్ పదేపదే సమీక్షల్లో నేతలను అడుగుతున్నారు. అంటే జగన్ ఉద్దేశ్యంలో లబ్దిదారులంతా వైసీపీకే ఓట్లేయాలని. కానీ జనాల ఆలోచనలు మాత్రం  వేరుగా ఉంటాయి. ఈ విషయం మునుగోడు ఉపఎన్నికలో స్పష్టమైంది. కాబట్టి సంక్షేమపథకాలను మాత్రమే నమ్ముకోకుండా జగన్ ఎలక్షనీరింగును కూడా పక్కాగా చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: