వచ్చేఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలవకపోతే భూమి బద్దలైపోతుందన్నట్లుగా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారు. టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నట్లుగా విచిత్రంగా చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెడతానని చేసిన ప్రతిజ్ఞనను నెరవేర్చాల్సిన బాధ్యత జనాలమీదుందంటున్నారు. ఇక్కడే చంద్రబాబు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. శపథం చేసేది చంద్రబాబైతే దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మాత్రం జనాలదట. ప్రపంచంమొత్తంమీద ఇంతటి విచిత్రమైన లాజిక్ వినిపించటం చంద్రబాబుకు తప్ప మరొకళ్ళకు సాధ్యంకాదు.





సరే ఆ శపథాన్ని కాసేపు పక్కనపెట్టేస్తే అసలు టీడీపీ గెలుపు ఎవరికి అవసరం. చంద్రబాబుతో పాటు కొడుకు లోకేష్, చంద్రబాబును ఆశ్రయించిన వాళ్ళతో కలిపి ఎల్లోమీడియాకు మాత్రమే అవసరం. రెండోసారి జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు, లోకేష్ బాగానే ఉంటారు. కానీ ఎల్లోమీడియా పరిస్ధితి ఏమవుతుందనేదే అర్ధంకావటంలేదు. మామూలు జనాలకు అధికారంలో చంద్రబాబు ఉన్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఒకటే. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు పరిపాలిస్తున్నారనే విషయాన్ని మాత్రమే జనాలు ఆలోచిస్తారు. 2014లో ముఖ్యమంత్రయిన చంద్రబాబు జనాల ఆకాంక్షలకు దూరంగా జరిగారు కాబట్టే 2019లో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు.





టీడీపీకి 23 సీట్లే ఎందుకిచ్చారు ? వైసీపీకి 151 సీట్లు రావటానికి కారణం ఏమిటనే విషయంలో ఇప్పటికీ చంద్రబాబు నిజాయితీగా విశ్లేషించుకున్నట్లు కనబడటంలేదు. అందుకనే జనాలను జగన్ మాయచేసి ఓట్లేయించుకున్నారు, మోసంచేసి ఓట్లేయించుకున్నారనే సొల్లుకబుర్లతో నెట్టుకొస్తున్నారు. కర్నూలు రోడ్ షోలో జనాలతో మాట్లాడుతు జనాలను జగన్ అరాచకపాలన అంతమవ్వాలంటే టీడీపీ అధికారంలోకి వచ్చితీరాలని చెప్పారు. 2014-19 మధ్య చంద్రబాబు జనరంజకపాలన సాగిస్తే తర్వాత ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఎందుకంత ఘోరంగా ఓడగొడతారు ?





ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ ఉంటుంది లేకపోతే తెలంగాణాలో పరిస్ధితే అయిపోతుంది. ఎన్టీయార్ చేతిలో పురుడుపోసుకున్న టీడీపీ చంద్రబాబు చేతిలో భూమిలో కలిసిపోయిందని జనాలు చెప్పుకుంటారు. లోకేష్ సామర్ధ్యంరీత్యా పార్టీని పైకి లేపుతాడని బహుశా చంద్రబాబుకే నమ్మకం లేనట్లుంది. అందుకనే చివరి ఎన్నికలని డైరెక్టుగా జనాలకే చెప్పేశారు. రాబోయేదే పార్టీకి చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పారంటేనే పార్టీ భవిష్యత్తు అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: